Financial Terms Used During Budget Speech: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పణకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), వచ్చే నెల మొదటి రోజున (01 ఫిబ్రవరి 2025) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. కేంద్ర బడ్జెట్ కోసం సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, వీధి వ్యాపారస్తుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు, MSMEల నుంచి పెద్ద పరిశ్రమల వరకు.. దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి రంగం ఎదురు చూస్తోంది. సాధారణంగా, బడ్జెట్‌లో సామాన్య జనానికి అర్థం కాని విషయాలు, పదాలు చాలా ఉంటాయి. ఆ పదాల గురించి తెలీకుండా బడ్జెట్ ప్రసంగం వింటున్నప్పుడు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
బడ్జెట్ ప్రకటన సమయంలో ఆర్థిక మంత్రి నోటి నుంచి వచ్చే క్లిష్టమైన పదాల గురించి మీరు ముందే తెలుసుకుంటే, ఫిబ్రవరి 01న బడ్జెట్ ప్రసంగం మీకు సులభంగా అర్ధం అవుతుంది.
బడ్జెట్ ప్రసంగంలో వినిపించే ఆర్థిక రంగ పదాలు (Financial terms used in the budget speech)
రిబేట్ (రాయితీ) - ఆదాయ పన్ను గురించి చెప్పే సమయంలో 'రిబేట్' అనే పదం వినిపిస్తుంది. అనుమతించిన రిబేట్ & డిడక్షన్స్ తర్వాత మిగిలిన మొత్తంపై ఆదాయ పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు తాను ఎంత పన్ను చెల్లించాలో లెక్కించిన తర్వాత, చెల్లించాల్సిన పన్ను మొత్తంపై రిబేట్ రూపంలో ఉపశమనం లభిస్తుంది.
ఓల్డ్ టాక్స్ రిజిమ్ (పాత పన్ను విధానం) - ఓల్డ్ టాక్స్ రిజిమ్ కింద నాలుగు ఆదాయ పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. పాత పన్ను విధానంలో రూ. 10 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు.
న్యూ టాక్స్ రిజిమ్ (కొత్త పన్ను విధానం) - దీనిలో 7 ఆదాయ పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. రూ. 3 నుంచి రూ. 7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను విధించారు. గరిష్టంగా 30 శాతం పన్ను చెల్లించాలి.
ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం)- ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో, ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు & సేవల ధరల్లో వచ్చిన పెరుగుదలను ఇన్‌ఫ్లేషన్ అంటారు. దీనిని శాతంలో కొలుస్తారు.
డైరెక్ట్ టాక్స్ (ప్రత్యక్ష పన్ను) - ఇది, ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి నేరుగా చెల్లించే ఆదాయ పన్ను లేదా ఒక కంపెనీ నేరుగా కార్పొరేట్ టాక్స్ రూపంలో చెల్లించే పన్ను. ఈ పన్నులను వ్యక్తులు & కంపెనీలు ప్రభుత్వానికి డైరెక్ట్‌గా జమ చేస్తాయి.
ఇన్‌డైరెక్ట్ టాక్స్ (పరోక్ష పన్ను) - మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు, దాని ధరలో ఇమిడి ఉన్న ఉన్న పన్ను ఇది. మనం ఈ పన్నును నేరుగా ప్రభుత్వానికి చెల్లించము, వస్తువును కొనడం ద్వారా పరోక్షంగా చెల్లిస్తాము.
క్యాపెక్స్ (మూలధన వ్యయం) - క్యాపెక్స్ అనేది క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌కు సంక్షిప్త నామం. కంపెనీలు తమ వ్యాపారం, సామర్థ్యం, ఉత్పాదకతను పెంచుకోవడానికి మూలధన వ్యయం చేస్తాయి. ప్రభుత్వం కూడా వివిధ ప్రాజెక్టుల కోసం మూలధన వ్యయం చేస్తుంది.
సెస్ - ఇది, పన్నుపై విధించే పన్ను. సెస్ ఆదాయాన్ని నిర్దిష్ట రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. ఉదాహరణకు, బంగారం కొనుగోలుపై మీరు చెల్లించే సెస్‌ను వ్యవసాయ రంగం వృద్ధికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉపయోగిస్తుంది.
డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) - అంటే, ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించడం. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
టీసీఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) - వస్తువులు & సేవల కొనుగోళ్ల సమయంలో TCS వర్తిస్తుంది. వస్తువు లేదా సేవల విక్రేత, ప్రభుత్వం తరపున కొనుగోలుదారు నుంచి ఈ పన్నును ముందస్తుగా వసూలు చేస్తాడు.
టీడీఎస్ (టాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్) - వస్తువులు & సేవల కొనుగోళ్లకు TDS వర్తిస్తుంది. వస్తువు లేదా సేవల విక్రేత, ప్రభుత్వం తరపున కొనుగోలుదారు నుంచి ఈ పన్నును ముందస్తుగా కట్ చేస్తాడు.
టాక్స్ డిడక్షన్ (పన్ను మినహాయింపు) - ఈ పదం కూడా ఆదాయ పన్ను, పెట్టుబడుల విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది. దీనిలో, ఆదాయం నుంచి పన్ను మినహాయించిన తర్వాత మిగిలిన డబ్బు ఆ వ్యక్తికి ఇస్తారు. జీతపు ఆదాయం, పెట్టుబడిపై వడ్డీ ఆదాయం ఈ వర్గంలోకి వస్తాయి.
మరో ఆసక్తికర కథనం: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!