Cyber Crime: స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సైబర్ నేరగాళ్లు ఎన్నో మార్గాల ద్వారా అమాయకుల సొమ్మును దోచేస్తున్నారు. ఏ కష్టం లేకుండానో, తక్కువ పెట్టుబడితో ఊహించని లాభాలు సాధించాలన్న ఆశ ప్రజల్ని చిక్కుల్లో పడేస్తుంది. దేశంలో ప్రాచుర్యం పొందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ టీవీ కార్యక్రమం పేరిట ఇటీవల సైబర్ నేరగాళ్ళు సరికొత్త మోసానికి తెరతీశారు. వీరి వలలో చిక్కుకున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి  మండలం పంగిడిమాధర గ్రామానికి చెందిన ఆత్రం రవీందర్ అనే యువకుడు ఏకంగా రూ.8 లక్షల 50 వేలు మోసపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఎద్దుల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి.. 
బాధితుడు ఆత్రం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... మార్చ్ నెలలో వాట్సాప్ మెసేజ్ లో మీరు కౌన్‌బనేగా కరోడ్‌పతిలో 25 లక్షల బీఎండబ్ల్యూ కారు బంపర్ డ్రాలో గెలుచుకున్నారని.. దానికి మీరు 50 వేలు ఇన్‌కమ్ ట్యాక్స్ మరియు రకరకాల ట్యాక్స్ లు చెల్లించాలని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ యువకుడు ఇంట్లో ఉన్న వస్తులు, ఎద్దులు, టీవీ లాంటి వస్తువులన్నీ అమ్మి మొత్తం 8 లక్షల 50 వేలు చెల్లించాడు. దీంతో మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.25 లక్షలు డిపాజిట్ అయ్యాయని చెప్పడంతో బాధితుడు అవాక్కయ్యాడు.


మరో 50 వేలు డిపాజిట్ చేస్తేనే నీ డబ్బులు నీకొస్తాయి.. 
ఆ తర్వాత కొద్ది రోజులకి ఆత్రం రవీందర్ కి మరో కాల్ వచ్చింది. ఆదాయపన్ను పరిమితి లేనందున ఆ డబ్బుని మధ్యలో ఒక బ్యాంకులో ఆపేశారని అవతలి వ్యక్తి చెప్పాడు. అవన్నీ క్లియర్ చేయాలంటే రూ.50వేలు డిపాజిట్ చేయాలంటూ తెలిపాడు. ఇలా పలు రకాల ఫేక్ స్టిక్కర్ల సర్టిఫికేట్లు అందించారు. ఇవన్నీ కాదని, తాను గెలుచుకున్న డబ్బులు తనకు ఇవ్వాలని బాధితుడు ఎన్నిసార్లు కోరినా అవతలి వారు ఏదొక కారణం చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు. చివరికి సైబర్ నేరగాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో స్థానిక తీర్యాణి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు. వ్యవసాయం మీదే ఆధారపడ్డ తాను రెండు ఎద్దులతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి మరీ డబ్బులు ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు తనకి న్యాయం చేసేది ఎవరంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.  


సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిందే.. లేదంటే! 
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులకు ఈ విషయాలు తెలియక సైబర్ నేరగాళ్ళ భ్రమలో పడి సర్వం కోల్పోతున్నారు. కాబట్టి ఏజెన్సీ గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత బృందాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.


Also Read: అమ్నిషియా పబ్ రేప్ కేసులో కీలక పరిణామం - వాళ్లు మైనర్లు కాదు: జూబ్లీహిల్స్ పోలీసులు