Jubilee Hills Minor Rape Case: మే నెలలో జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో పార్టీ జరిగిన తర్వాత మైనర్‌పై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అమ్నిషియా పబ్ వ్యవహారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకుసి విచారణ చేపట్టి, వారంతా మైనర్లు అని తేలడంతో శిక్షనుండి తప్పించుకునుకే అవకాశం ఉందని అందరూ భావించారు.
జూబ్లీహిల్స్ పోలీసులు కీలక నిర్ణయం.. ప్రజల మద్దతు
తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకున్న నిర్ణయం కేసును కొత్త మలుపు తిప్పింది. కొన్ని నెలల కిందట జూబ్లీహిల్స్ లోని అమ్నిషియా పబ్ లో మైనర్లంతా పార్టీ పేరుతో ఎంజాయ్ చేసి అక్కడ ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కారులో తీసుకువెళ్లి అత్యాచారం చేసిన కేసు పోలీసులకు సవాల్ గా మారింది. మైనర్లు కావడంతో కేసు విచారణతో పాటు కేసు నమోదులోనూ జాప్యం జరగగా.. మహిళా సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ఘటనకు నిరసనగా భారీ స్దాయిలో అందోళనలు చేశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలనే వాదనలు బలంగా వినిపించాయి. పోలీసులు సైతం ఈ కేసులో విచారణ వేగవంతంగా జరపడంతో పాటు పలు కీలక ఆధారాలను సేకరించి నిందితులను కోర్టు బోనులో నిలబెట్టారు. అయితే ఇందులో కీలక నిందితులంతా మైనర్లు కావడంతో కేసు ప్రాధాన్యత ఒక్కసారిగా మారిపోయింది.
మైనర్లమనే సాకుతో తప్పించుకునేందుకు నిందితులు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శలు వచ్చాయి. మైనర్లు అని చెప్పి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ వారి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ సంచలన కేసు(Amnesia Pub Rape Case) లో నిందితులు తప్పించుకున్నట్లే అని అంతా అనుకున్న సమయంలో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పేరుకే మైనర్లు కానీ..
అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న వీరు పేరుకే మైనర్లని, వీరి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, మేజర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు వీరిలో ఉన్నాయంటూ కోర్టు ముందు అందుకు తగిన అన్ని ఆధారాలను ప్రవేశపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగా వీరికి లైంగిక పటుత్వ పరిక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మేజర్లకు ఉండాల్సిన పరిపక్వత ఉన్నట్లు నిర్దారణ అయినట్లు కోర్టుకు తెలిపారు. వీరి నడవడిక, ఆలోచన విధానం, వ్యవహార శైలి ఇవన్నీ పూర్తి స్దాయిలో పలుమార్లు సుధీర్ఘ విచారణ జరిపిన జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకు అన్ని మెడికల్,టెక్నికల్ ఆధారాలను సమర్పించినట్లు సమాచారం.
తమ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుని అమ్నిషియా పబ్ కేసులో మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు మైనర్లను మైజర్లుగా గుర్తించాలని కోరారు. అలా అనుమతిస్తే వీరిపై కఠిన చట్టాలను ఉపయోగించి, తగిన శిక్షలు పడేలా కీలక ఆధారాలు కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు కోర్టుకు విన్నవించారు. నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ మరో రెండు లేదా మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పోలీసుల పిటిషన్ పరిశీలించి, ఆధారాలను దృష్టిలో పెట్టుకుని కేసులో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తే ఓ అరుదైన కేసుగా మారుతుంది. కేసులో ఉన్న కఠిన చట్టాలతో నిందితులకు శిక్షలు పడటంతోపాటు, భవిష్యత్తులో మైనర్లమనే సాకుతో నేరాలకు పాల్పడవచ్చనుకునే వాళ్లకు ఓ హెచ్చరికలా ఈ కేసు నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.