KCR Politics : ఇతర రాష్ట్రాల్లోని వారికి సాయం చేయడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులతో సిద్ధం చేసిన చెక్కులను తీసుకుని వెళ్తున్నారు. అక్కడి బాధితులకు భరోసా ఇచ్చి వస్తున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి.. గల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు.. అలాగే ఇతరులకు కూడా సాయం చేసి వస్తున్నారు. ఈ విషయంలో ఆయన సహృదయతను అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ తెలంగాణలో మాత్రం ఆయనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎంత పెద్ద విషాదం చోటు చేసుకున్నా కేసీఆర్ కనీసం స్పందించకపోతూండటమే దానికి కారణం.
కు.ని ఆపరేషన్ల విషాదంపై కేసీఆర్ స్పందన నిల్!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్‌లో పర్యటిస్తున్న సమయంలోనే తెలంగాణలో భారీ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు తల్లులు చనిపోగా.. ముఫ్ఫై మందికిపైగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. వారిని అపోలో లాంటి ఆస్పత్రుల్లో చేర్చి కాపాడారు. అయితే ఈ విషాదంపై ప్రభుత్వాధినేత స్పందించలేదు.బాధితులకు పరామర్శ లేదు. ఇలాంటి సందర్భాల్లోనే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చనిపోయినవారంతా పేద తల్లులు. తల్లులను కోల్పోయిన పిల్లల ఆక్రందనలు అందరి గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ఇంతటి విషాద ఘటనపై స్పందించలేదు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం చెక్కులు పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తెలంగాణ బాధితుల విషయంలో కేసీఆర్ వైఖరి అంతే !
తెలంగాణలో ఎంత పెద్ద విషాదం జరిగినా కేసీఆర్ స్పందన అంతే ఉంటుంది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు చేశారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. పలుమార్లు విద్యార్థులు రోడ్లెక్కారు. అయినా సీఎం ఒక్కసారి కూడా స్పందించలేదు. కొండగట్టు బస్సు ప్రమాద విషాదం గురించి చాలా మంది ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 11, 2018న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేసియా ఎప్పటికి ఇచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతపెద్ద ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని కానీ, బాధితులను కానీ సందర్శించలేదు.ఇలాంటి పలు ఘటనలు కేసీఆర్‌ను వేలెత్తిచూపుతున్నాయి. ఇదేం వైఖరి అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న రైతులు, సాయం అందాల్సిన మాజీ సైనికుల గురించి చెబుతున్న విపక్షాలు
సైనికులకు , రైతులకు సాయం చేయడం తప్పా అని వాదిస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను విపక్ష పార్టీలు చూపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ఇస్తున్నాయి. వారికెందుకు సాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అమ్ముకోలేక.. ఆ బస్తాల మీదనే చనిపోయిన రైతులు పదుల సంఖ్యలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో పలువురు అమరులన సైనికులకు ఇవ్వాల్సిన సాయం ఇంకా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారు కానీ.. సొంత రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని అంటున్నారు.
సొంత రాజకీయం కోసమే చేస్తున్నారన్న విమర్శలు !
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ ఇష్టారాజ్యంగా పార్టీ విస్తరణ కోం ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో అవసరం లేకపోయినా దేశవ్యాప్తంగా ప్రతి చిన్నా చితకా పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇందు కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయ వ్యూహాలతోనే రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకు ఓదార్పునిచ్చినా.. పెద్దగా వ్యతిరేకత వచ్చి ఉండేది కాదుకానీ తెలంగాణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోవడం టీఆర్ఎస్ నేతలకూ మింగుడు పడటం లేదు. కేసీఆర్ రాజకీయ పర్యటనలు చేస్తే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాదు కానీ.. తెలంగాణ ప్రజల సొమ్మును.. ఇతర రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి వెళ్తూండటం వల్లనే సమస్య వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.