Donkey Milk Scam In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో భారీ స్కాం వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిద పాల (Donkey Milk) పేరిట నిండా ముంచేసింది. ఓ సంస్థ దాదాపు రూ.100 కోట్ల వరకూ ఎగవేసిందని బాధితులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్‌లో గాడిద పాలకు ఉన్న డిమాండ్, హైప్ ఆసరాగా తీసుకుని ఓ సంస్థ ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశ చూపి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు తీసుకుని డబ్బులు ఎగవేసిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. చెన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి నిలువునా ముంచారని మండిపడ్డారు. 


బాధితులు ఏం చెప్పారంటే.?


కొవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అది చూసి సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. 'డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్ రమేశ్ బృందం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క రైతు వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారు. ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున విక్రయించారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నమ్మకం కలిగించేలా 3 నెలలు నగదు చెల్లింపులు చేశారు. అయితే, గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు.' అని వాపోయారు.


'400 మంది రైతులు.. రూ.100 కోట్ల నష్టం'


దీనిపై ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ బ్యాంకు చెక్కులు రాసిచ్చారని బాధితులు తెలిపారు. 'ఈ చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్సయ్యాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకూ నష్టపోయారు. ఇదో పెద్ద స్కాం. దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చు. ఈ విషయంపై చెన్నై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఒప్పందం క్రమంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని తేలింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు న్యాయం చేయాలి. లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం.' అని బాధితులు ఆందోళన చెందారు.


ఇదీ జరిగింది


కాగా, గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే రూ.కోట్లు గడించవచ్చని కేటుగాళ్లు కొందరిని నమ్మించారు. వీరి మాటలు నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ చాలామంది పెట్టుబడులు పెట్టారు. గ‌తేడాది జూలై 23న త‌మిళ‌నాడులో ది డాంకీ ప్యాలెస్‌ను ప్రారంభించిన అనంతరం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అధిక లాభాలు పొందొచ్చంటూ ఆశ చూపారు.


Also Read: Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!