Andhra Haunting drones:  ఆంధ్రప్రదేశ్ పోలీసుల అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. పలు జిల్లాల్లో నాటు సారా తయారీ, పేకాట ఆడేవారిని ఆచూకీని ఈ డ్రోన్లు పోలీసులకు చూపిస్తున్నాయి. తిరుపతి పోలీసులు ఇటీవల నాటు సారా తయారు చేస్తున్న వారిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇలాంటి వాటికి  కేంద్రంగా మారాయని భావిస్తున్న ప్రాంతంలో  డ్రోన్లుతో నిఘా పెట్టారు. అక్కడ వారికి ఏమీ కనిపించలేదు కానీ.. ఓ చెట్టు తొర్ర మాత్రం కాస్త భిన్నంగా కనిపించింది. పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు.  చెట్టు తొర్ర నిండా నాటు సారాను ఉంచినట్లుగా గుర్తించారు.                          

ఎర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన, వేములవాడ గ్రామాలలో నాటుసారా తయారీ ఇటీవలి కాలంలో రహస్యంగా సాగుతోంది. దాన్ని తయారుచేసి ఎవరికీ అనుమానం రాకుండా వివిధ ప్రాంతాల్లో దాచి, రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, ఈ ముఠాలు దొరకడం గగనమైంది. ముఖ్యంగా చెట్ల చాటున సారా తయారుచేసి, పోలీసుల కళ్ళుగప్పి చెట్ల తొర్రల్లో దాచి ఉంచడం పోలీసులకు ఓ పెద్ద సవాల్‌గా మారింది. చందమామ కథల్లో రహస్య నిధులు దాచిపెట్టే చెట్టు తొర్రల ప్రస్తావన గుర్తుందా? సరిగ్గా అలాంటి పద్ధతిలోనే వీరు సారాను దాచేవారు. ఎంతోమంది సిబ్బంది, రోజుల తరబడి గాలించినా ప్రయోజనం లేకుండా పోయేది.

పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరించారు. భాకరా పేట సీఐ ఇమ్రాన్‌ బాషా ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసులు అత్యాధునిక డ్రోన్‌లను రంగంలోకి దించారు.  ఈ డ్రోన్లు అత్యాధునిక కెమెరాలతో ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టే డ్రోన్‌లే ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి. ఎర్రావారిపల్లె మండలం వేములవాడ గ్రామం, తలకోన వాటర్‌ కెనాల్‌, భాకరాపేటతో పాటు దాదాపు 25 ప్రాంతాల్లో డ్రోన్‌లు నిఘా పెట్టాయి. అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని, చివరకు దట్టమైన ఆకుల చాటున ఉన్న చెట్టు తొర్రలను కూడా నిశితంగా పరిశీలించాయి. ప్రత్యేక బృందం సీఐ వినోద్‌కుమార్‌ డ్రోన్‌ అందించిన స్పష్టమైన ఫొటోల ఆధారంగా సారా తయారు చేసి దాచి ఉంచిన రహస్య స్థలాలను గుర్తించారు.                    

వెంటనే పోలీసులు మెరుపు వేగంతో ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ వారికి ఎదురైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊహించని విధంగా, చెట్ల తొర్రల్లో దాచి వుంచిన 14 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌ నిఘా వల్లే వేములవాడ గ్రామానికి చెందిన హనుమంతు, వేణు, మునస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   గంజాయి నుండి నాటుసారా మాఫీయాల వరకు నిర్వహిస్తున్న అక్రమ కార్యకలాపాలను కనుగొనడంలో ఇలాంటి అసాధారణ విజయాలు లభిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరస్తులు ఎంత చాకచక్యంగా వ్యవహరించినా, చట్టం నుండి తప్పించుకోలేరని ఈ సంఘటన గట్టిగా స్పష్టం చేస్తోంది.