Jhansi Medical College Fire Accident: ఝాన్సీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగం ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం రాత్రి దాదాపు 10:35 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చిన్నారుల మృతిపై జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.


మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్ని గమనించి
పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనలకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసింది. మరోవైపు ఐసీయూ మొత్తం పొగతో నిండుకోవడంతో అక్కడి డాక్టర్లు, సిబ్బంది కిటికీ అద్దాలు బద్దలుకొట్టి శిశువులు, చిన్నారులు బయటకు తరలించారు. 35 నుంచి 40 మంది వరకు చిన్నారులను రక్షించారు. కానీ మరో 10 మంది శిశువులు ఈ దుర్ఘటనలో సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా అందర్నీ కలచివేస్తోంది.






సీఎం యోగి దిగ్భ్రాంతి
ఝాన్సీలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృతి ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాచక చర్యలు వేగవంతం చేసి మరిన్ని మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం యోగి ఆదేశించారు. మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 



ఘటనాస్థలానికి వెళ్లిన డిప్యూటీ సీఎం
మహారాణి లక్ష్మీభాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలియగానే యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది, ఎంత మంది చిన్నారులు చనిపోయారు.. ప్రస్తుత పరిస్థితి ఏంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందుకున్న వెంటనే ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నాయి. కొన్ని గంటలపాటు శ్రమించి సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రోదనతో ఆస్పత్రి వద్ద దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. శిశువులను కోల్పోయిన తల్లిదండ్రులను వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.