IND vs SA 4th T20I Highlights | జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన నాలుగో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. అనంతరం బౌలర్లు సైతం అద్భుతంగా రాణించడంతో భారత్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సఫారీ జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులు చేసి ఆలౌటైంది. దాంతో నాలుగో టీ20తో పాటు సిరీస్ ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది.
తొలిసారి టాస్ నెగ్గిన భారత కెప్టెన్
సిరీస్ లో తొలి మూడు మ్యాచ్‌లలో టాస్ ఓడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ కీలకమైన నాలుగో టీ20లో టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు. 18 బంతుల్లో 36 పరుగులు చేసిన అనంతరం అభిషేక్ శర్మ వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. 5వ ఓవర్లో అభిషేక్ శర్మ మూడు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. తరువాతి ఓవర్లో సిపమ్లా బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచిచ్చి ఔటయ్యాడు. తరువాత క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మతో కలిసి ఓపెనర్ సంజూ శాంసన్ దక్షిణాఫ్రికా బౌలర్లకు పీడకలలు వచ్చేలా బ్యాటింగ్ చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు సంజూ శాంసన్ బ్యాట్ తో పోటీపడి తెలుగు తేజం తిలక్ వర్మ కదం తొక్కాడు. ఓ ఓవర్లో తిలక్ వర్మ రెండు సిక్సర్లు బాదగా, మరుసటి ఓవర్లో శాంసన్ రెండు సిక్సర్లు బాదడంతో తొలి 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది.
శాంసన్, తిక్ వర్మ శతకాల మోత
సంజూ శాంసన్ 51 బంతుల్లో శతకం బాదేయగా, ఆ వెంటనే తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఓపెనర్ సంజు శాంసన్ (109 నాటౌట్, 56 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు), తెలుగుతేజం తిలక్ వర్మ (120 నాటౌట్, 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు) అజేయ శతకాలతో సఫారీ బౌలర్లును ఊచకోత కోశారు. దాంతో నాలుగో టీ20లో భారత్ కేవలం వికెట్ నష్టపోయి 283 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. కాగా, టీ20 చరిత్రలో భారత జట్టుకిది రెండో అత్యధిక స్కోర్. అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ పై 6 వికెట్లు నష్టపోయి చేసిన 297 పరుగులు అత్యధిక స్కోరు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పలు క్యాచ్‌లను జారవిడచడం సైతం భారత బ్యాటర్లకు కలిసొచ్చింది. సఫారీ బౌలర్లలో సిపమ్లా ఒక వికెట్ తీశాడు.
తొలి ఓవర్లోనే షాక్, మూడో ఓవర్లో డబుల్ షాక్
భారత బౌలర్ అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా మరో ఓపెనర్ రికెల్టన్ (1) పని పట్టాడు. కీపర్ సంజూ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్షదీప్ సింగ్ సఫారీలకు డబుల్ షాకిచ్చాడు. 5వ బంతికి కెప్టెన్ మార్‌క్రమ్ (8), చివరి బంతికి డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (0)ను పెవిలియన్ చేర్చి భారత్ విజయం దాదాపు ఖాయం చేశాడు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (43), డేవిడ్ మిల్లర్ (36) కాస్త పరవాలేదనిపించారు.
గత మ్యాచ్ లో చెలరేగి హాఫ్ సెంచరీ చేసిన మార్కో జాన్సన్ (29 నాటౌట్, 12 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ కోట్జీ (12), కేశవ్ మహరాజ్ (6)లను ఔట్ చేశాడు. లుతో సిపామ్లను రమణ్ దీప్ సింగ్ ఔట్ చేయడంతో 148 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ కాగా, 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. భారత జట్టు సంబరాల్లో మునిగితేలింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. పాండ్యా, రమణ్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.