Mike Tyson vs Jake Paul Live Streaming | టెక్సాస్: అమెరికా బాక్సర్, ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ (Mike Tyson) మరోసారి పంచ్‌లు విసిరేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా 58 సంవత్సరాల వయస్సులో సింహబలుడుగా పేరు తెచ్చుకున్న మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్ లోకి దిగాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా టైసన్ బరిలోకి దిగుతున్న ఈ బాక్సింగ్ బౌట్ వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


టైసన్ వయసు చూసే అంత ఆశ్చర్యపోతే.. ఇక అతడి ప్రత్యర్థి వయసు చూస్తే మరింత షాకవటం ఖాయం. ఎందుకంటే మైక్ టైసన్ ఢీకొట్టేది తన కంటే వయసులో సగం కూడా లేని బాక్సర్. అతడు మరెవరో కాదు అమెరికాకు చెందిన ఫేమస్ యూట్యూబర్, ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ జోసెఫ్ పాల్ (Jake Paul). ప్రస్తుతం జేక్ పాల్ వయసు 27 ఏళ్లు. దశాబ్దం కిందట సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి క్రమంగా ఎదుగుతూ అమెరికాలో ఫేమస్ యూట్యూబర్ గా మారాడు. మరోవైపు బాక్సింగ్ పై మక్కువ పెంచుకుని ప్రొఫెషనల్ బాక్సర్ గా మారి ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించి విజయాలు అందుకున్నాడు.


తనలో సగం వయసు కూడా లేని బాక్సర్‌తో మ్యాచ్
మైక్ టైసన్ 2005లో దాదాపు 39 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి వైదొలిగాడు. వివాదస్పద బాక్సర్‌గా ఫేమస్ అయిన మైక్ టైసన్ నిమిషంలోపే ప్రత్యర్థులను తన ముష్టిఘాతాలతో ఊపిరాడకుండా చేయగల సమర్థుడు. ఎన్నో మ్యాచ్‌లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసి విజయం సాధించాడు. కానీ ప్రస్తుతం టైసన్ వయసు 58 ఏళ్లు కాగా, తన కంటే వయసులో 31 ఏళ్లు చిన్నవాడైన మరో అమెరికా బాక్సర్ జేక్ పాల్ తో సాహసోపేత బౌట్ కు సిద్ధమయ్యాడు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడంటూ మైక్ టైసన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారే అధికం. ఎందుకంటే అతడి వయసు ఓ కారణం కాగా, ప్రత్యర్థి అసలుసిసలైన యువకుడు కావడం. ఎన్నో చెడు అలవాట్లకు బానిసగా బారిన టైసన్ ఈ వయసులో





యువ బాక్సర్ తో బరిలోకి దిగి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నాడని అతడి నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తే, మరికొందరేమో జాలి చూపిస్తున్నారు.


ఎక్కడ వీక్షించాలి, మ్యాచ్ టైమ్..
అమెరికన్ బాక్సర్లు మైక్ టైసన్, జేక్ పాల్‌ టెక్సాస్ లోని ఆర్లింగ్టన్‌లోని ఏటీ&టీ స్టేడియంలో తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16న ఉదయం 6:30 గంటలకు యంగ్ బాక్సర్, ఓల్డ్ బాక్సర్ రింగ్ లోకి దిగనున్నారు.  నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాక్సింగ్ మ్యాచ్ లైవ్ వీక్షించవచ్చు. ఇందుకోసం అదనంగా చెల్లింపులు చేయాల్సిన పనిలేదు.  2024లో ఎక్కువ మంది వీక్షించే, అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన బాక్సింగ్ బౌట్ ఇదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.



ముందే చెంప పగిలింది..
బాక్సింగ్ మ్యాచ్ వెయిట్ చెకింగ్ సమయంలో ఊహించని ఘటన జరిగింది. ముందుగా టైసన్ వేదిక మీదకు వచ్చాడు. తరువాత జేక్ పాల్ బరువు కొలిచే సమయంలో పిచ్చి చేష్టలు చేస్తూ వేదిక మీదకు వస్తూనే ప్రత్యర్థి మైక్ టైసన్ కాలు తొక్కాడు. టైసన్ వెంటనే తనదైనశైలిలో స్పందించి జేక్ పాల్ ను చెంప దెబ్బకొట్టాడు. వెంటనే బౌన్సర్లు టైసన్ ను నిలువరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ప్రైజ్ మనీ
మైక్ టైసన్ ఈ బాక్సింగ్ బౌట్‌లో విజయం సాధించినట్లయితే 20 మిలియన్ల అమెరికా డాలర్లు అందుకుంటాడు. యువ బాక్సర్ జేక్ పాల్ కనుక టైసన్ ను చిత్తు చేస్తే ఏకంగా 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీ అందుకుంటాడు.