How to Invest In Digital Real Estate: రియల్ ఎస్టేట్ పెట్టుబడి గురించి అందరికీ తెలుసు. ఇల్లు లేదా భూమిని అద్దెకు ఇవ్వడానికి లేదా లాభానికి అమ్మడం. ఇది చాలా సులభం. డిజిటల్ రియల్ ఎస్టేట్ కూడా అదే విధంగా పని చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో చూసే ప్రతి డొమైన్ పేరు, వెబ్‌సైట్, బ్లాగ్ వంటివన్నీ ఇంటర్నెట్ ప్రాపర్టీ. వీటిని డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ అసెట్స్‌ అంటారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, స్థలాల మాదిరిగానే మీరు వీటిని కొనొచ్చు, అమ్మొచ్చు.


వాస్తవానికి, డొమైన్ పేర్లు, వెబ్‌సైట్‌ల క్రయవిక్రయాలను వృత్తిగా పెట్టుకుని, పూర్తి సమయం దానికే కేటాయించే వ్యక్తులు కూడా ఉన్నారు. కొన్ని డొమైన్ పేర్లు మిలియన్ల డాలర్లకు అమ్ముడవుతాయి. కొన్ని వెబ్‌సైట్‌లకు చాలా డిమాండ్‌ ఉంటుంది.



డిజిటల్ రియల్ ఎస్టేట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
వెబ్‌సైట్‌లను రూపొందించడానికి, నిర్వహించడానికి, వెబ్ డిజైన్ తప్పులను సరి చేయడానికి అధునిక సాంకేతిక పరిజ్ఞానం & వెబ్ డిజైన్ అనుభవం అవసరమనే ఆలోచనతో చాలా మంది వ్యక్తులు వెబ్‌సైట్‌లలో పెట్టుబడి పెట్టడానికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఇది నిజం కాదు. ఒక వెబ్‌సైట్‌ను సెటప్ చేయడానికి, డిజిటల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. నూతన సాంకేతికతలు, WordPress వంటి ఉచిత సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లు కొత్తవాళ్లకు చక్కటి దారి చూపుతున్నాయి. ఇప్పుడు, మీరు కేవలం ఒక క్లిక్‌తో వెబ్‌సైట్‌ను సెటప్ చేయవచ్చు.


డిజిటల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు:
1. బిజినెస్‌ డొమైన్ పేరు కొనుగోలుతో కొత్తగా ఒక వెబ్‌సైట్‌ను నిర్మించవచ్చు
2. ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయిన వెబ్‌సైట్‌ను కొనుగోలు చేయవచ్చు


కొత్తగా వెబ్‌సైట్‌ను రూపొందించడానికి తక్కువ పెట్టుబడి చాలు. అయితే, దానిని విజయవంతం చేయడానికి చాలా పని చేయాలి. అప్పుడే ఆ వెబ్‌సైట్‌ను లాభంతో అమ్మొచ్చు. ఎస్టాబ్లిష్‌డ్‌ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీకు చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ, ఆ సైట్ ఇప్పటికే లాభాలను ఆర్జిస్తున్నందున, మీ పెట్టుబడిని చాలా త్వరగా తిరిగి పొందవచ్చు.


ఎస్టాబ్లిష్‌డ్‌ వెబ్‌సైట్‌లను ఎక్కడ కొనుగోలు చేయాలి?
మంచి వెబ్‌సైట్‌ను అమ్మేందుకు ఫ్లిప్పా (Flippa) వంటి చాలా ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లు ఉన్నాయి. వెబ్‌సైట్‌లను కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఎప్పుడూ లిస్ట్‌లు చూడకండి. మీ సొంతంగా పరిశోధన చేయండి.


డిజిటల్ రియల్ ఎస్టేట్ నుంచి లాభం పొందడం ఎలా?
మీ వెబ్‌సైట్‌ను రూపొందించిన/కొనుగోలు చేసిన తర్వాత, మీ వెబ్‌సైట్‌కు విజిటర్స్‌ను ఆకర్షించడానికి, ట్రాఫిక్‌ పెంచడానికి మంచి కంటెంట్‌ ఇవ్వాలి. అది కూడా స్థిరమైన టైమ్‌ షెడ్యూల్‌తో ఉండాలి. ప్రజలు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్న పదాలను ఉపయోగించి మీ బ్లాగ్‌లో కంటెంట్‌ ఇవ్వాలి. అలాంటి పదాల కోసం 'గూగుల్‌ కీవర్డ్ ప్లానర్‌'ను ఉపయోగించండి. మీ తరపున కంటెంట్‌ రాయడానికి ఫ్రీలాన్సర్‌లను నియమించుకోండి. 


మీ వెబ్ ట్రాఫిక్ నుంచి డబ్బు సంపాదించే మార్గాలు:


1. ప్రకటనలు: యాడ్స్‌ కోసం మీ వెబ్‌సైట్‌లో కొంత స్పేస్‌ అమ్మండి. లేదా, వెబ్‌సైట్ ట్రాఫిక్‌తో డబ్బు ఆర్జించడానికి Google AdSense వంటి అడ్వర్‌టైజ్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించండి. విజిటర్స్‌ ఒక ప్రకటనను క్లిక్ చేసినప్పుడు మీరు కొంత డబ్బు సంపాదిస్తారు.


2. అనుబంధ మార్కెటింగ్: ఇతర వ్యాపారాల ఉత్పత్తులను ప్రచారం చేయడం & విక్రయించడం. మీ వెబ్‌సైట్‌లోని అనుబంధ లింక్ ద్వారా ఎవరైనా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడల్లా మీరు కమీషన్ పొందుతారు.


3. ఉత్పత్తి విక్రయాలు: మీ వెబ్‌సైట్‌లో ఇ-బుక్స్, ఆన్‌లైన్ కోర్సులు, సాఫ్ట్‌వేర్ వంటి మీ సొంత ఉత్పత్తులను సృష్టించి విక్రయించొచ్చు.


4. స్పాన్సర్డ్‌ కంటెంట్: తమ బ్రాండ్‌లు, ఉత్పత్తులను ప్రమోట్‌ చేసే బ్లాగ్ పోస్ట్‌లు రాయడానికి ప్రకటనదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ బ్లాగ్‌లో వారి ఉత్పత్తుల గురించి రాసినందుకు మీకు డబ్బు చెల్లిస్తారు.


కాలక్రమేణా మీ వెబ్‌సైట్ నుంచి లాభాలు రావడం ప్రారంభం కావచ్చు. అప్పుడు, దానిని లాభానికి అమ్మాలా లేదా ఆదాయాన్ని అభివృద్ధి చేస్తూ కొనసాగించాలా అని నిర్ణయించుకోవచ్చు.


మంచి విషయం ఏంటంటే, మీ వెబ్‌సైట్‌ నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్టాక్స్‌ లేదా ఫిజికల్‌ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కంటే, భవిష్యత్‌లో డిజిటల్ రియల్ ఎస్టేట్‌లో విలువ పెరుగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 


మరో ఆసక్తికర కథనం: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు