SBI Hikes Lending Rate: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (STATE BANK OF INDIA), రుణం తీసుకున్న వాళ్లకు & తీసుకోబోయే వాళ్లకు షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐ లోన్‌ను ఖరీదైన వ్యవహారంగా మార్చింది. రుణాలపై వడ్డీ రేట్లను ఈ రోజు (శుక్రవారం, 15 నవంబర్ 2024) నుంచి పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. కొత్త ఎంసీఎల్‌ఆర్‌ను ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంక్, వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు (5 bps లేదా 0.05 శాతం) పెంచింది. కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.
ఎంసీఎల్‌ఆర్ అంటే?
MCLR అంటే 'మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్' (Marginal Cost of Funds based Lending Rate). నిధుల వ్యయం, నిర్వహణ వ్యయాలు, లాభాల మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకు తన "కనీస వడ్డీ రేటు"ను (Minimum interest rate) నిర్ణయిస్తుంది. అంటే, ఇంత కంటే తక్కువ రేటును బ్యాంక్‌లు ఆఫర్ చేయవు. గృహ రుణాలతో సహా వివిధ రుణాలపై వడ్డీ రేటును లెక్కించేందుకు బ్యాంకులు MCLRను ఉపయోగిస్తాయి. ప్రతి బ్యాంక్‌కు MCLR వేర్వేరుగా ఉంటుంది.
ఎస్‌బీఐ రుణ రేటు ఎంత పెరిగింది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన కొత్త 'మార్జిన్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. వెబ్‌సైట్ ప్రకారం, వడ్డీ రేటు పెంపు తర్వాత, మూడు నెలల కాల వ్యవధి (Tenure) రుణాలపై ప్రస్తుత MCLR 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరిగింది. ఆరు నెలల కాల వ్యవధి లోన్లపై కనీస వడ్డీ 8.85 శాతం నుంచి 8.90 శాతానికి చేరింది. ఒక ఏడాది టెన్యూర్ లెండింగ్స్ మీద ఎంసీఎల్‌ఆర్ 8.95 శాతం నుంచి 9 శాతానికి చేరింది. రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం, రెండేళ్ల కాల వ్యవధి రుణానికి MCLR రేటు 9.05 శాతంగా, మూడేళ్ల టెన్యూర్‌కు కనీస వడ్డీ రేటు 9.10 శాతంగా ఉంది.
ఖాతాదార్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఏ బ్యాంకయినా, తన MCLR ఆధారంగా లోన్లపై వడ్డీ రేట్లను (Interest rates) నిర్ణయిస్తాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటులో జరిగే మార్పు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాల EMIలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లను పెంచుతూ ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ ఈఎంఐ మొత్తాన్ని చెల్లించాలి. బ్యాంకులు, స్వల్పకాలిక రుణాలైన వెహికల్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు ఆధారంగా నిర్ణయిస్తాయి. కానీ గృహ రుణం వంటి దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్లు RBI పాలసీ రేటు రెపో రేటు (Repo Rate) ఆధారంగా నిర్ణయిస్తాయి. రెపో రేటు పెరిగినప్పుడు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి, రెపో రేటు తగ్గినప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయి.
మరో ఆసక్తికర కథనం: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ