Zomato Share Price: ఫుడ్ డెలివరీ చైన్ కంపెనీ జొమాటో షేర్‌హోల్డర్లకు ఈ రోజు (గురువారం, 08 జూన్‌ 2023) చాలా ప్రత్యేకమైన రోజు. సుదీర్ఘ కాల నిరాశ తర్వాత షేర్‌హోల్డర్‌ల ముఖాల్లో చిరునవ్వును తిరిగి తెచ్చిపెట్టిన రోజు ఇది. జొమాటో స్టాక్ దాని IPO ధర రూ. 76ను మళ్లీ టచ్‌ చేసింది. ఇవాళ్టి ట్రేడ్‌లో, జొమాటో షేర్లు బీఎస్‌ఈలో రూ. 76.30 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరాయి. ఇదే 52-వారాల గరిష్ట స్థాయి కూడా. రోజు చివరకు, 1.69% లేదా రూ.1.26 లాభంతో రూ.75.80 వద్ద ముగిశాయి.


రూ.169 స్థాయి నుంచి పతనం
జొమాటో IPO 2021 జులైలో వచ్చింది. అప్పుడు, ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 76 చొప్పున మార్కెట్ నుంచి డబ్బును సేకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్ల లిస్టింగ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఒక్కో షేర్ రూ. 115 వద్ద లిస్టయింది. అదే ఏడాది నవంబర్ 16న ఈ స్టాక్ గరిష్టంగా రూ. 169కు చేరింది. ఆ తర్వాత, జొమాటో స్టాక్‌లో పతనం ప్రారంభమైంది, గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోయింది. గత ఏడాది జులై 26న, ఈ స్క్రిప్‌ రూ. 41 స్థాయికి పడిపోయింది. అంటే, ఈ షేరు గరిష్ట స్థాయి నుంచి 76 శాతం పడిపోయింది.


ఆ తర్వాత పుంజుకున్నా, ఈ ఏడాది మార్చి నెలలో మళ్లీ రూ. 49కి పడిపోయింది. కానీ, ఆ స్థాయి నుంచి పెట్టుబడిదార్లకు కేవలం రెండున్నర నెలల్లోనే 55 శాతం రాబడి ఇచ్చింది. కేవలం గత నెల రోజుల్లోనే 24 శాతం పైగా పెరిగింది. 


ప్రస్తుతం, జొమాటో మార్కెట్ విలువ దాదాపు రూ. 64,172 కోట్లు. అయితే, ఈ ఫుడ్‌ డెలివెరీ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయినప్పుడు మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లకు చేరువలో ఉంది. మార్కెట్ క్యాప్ ఇప్పటికీ ఆ స్థాయి కంటే దాదాపు రూ. 36,000 కోట్లు తక్కువలో ఉంది.


ప్రైస్‌ టార్గెట్‌ రూ.85
చాలా బ్రోకరేజ్ హౌస్‌లు జొమాటో స్టాక్‌ మీద చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. 85 రూపాయల లక్ష్యంతో షేర్లను కొనుగోలు చేయాలని మోర్గాన్ స్టాన్లీ సూచించింది. అంటే, ప్రస్తుత స్థాయి నుంచి కూడా ఈ స్టాక్ పెట్టుబడిదార్లకు 12 శాతం రాబడిని ఇవ్వగలదు. 


2022-23 జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో జొమాటో స్ట్రాంగ్‌ రిజల్ట్స్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరును పరిశీలిస్తే, కంపెనీ రూ. 5,506 కోట్ల ఆదాయం, రూ. 116 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,098 కోట్ల నష్టాన్ని చవిచూసింది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.