Indira Gandhi Assassination:


భారీ పరేడ్..


భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను గుర్తు చేస్తూ...ఆ ఉదంతాన్ని కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో పరేడ్‌లా నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. కొందరు సిక్కులు ఈ పరేడ్‌ని నిర్వహించి..."ఇదో వీరోచితమైన ఘటన" అనే స్థాయిలో ప్రచారం చేశారు. దాన్నో వేడుకగా నిర్వహించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వేర్పాటువాదులకు ఆశ్రయమివ్వడం సరికాదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు...కెనడా, భారత్ బంధంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తేల్చి చెప్పారు. ఓటుబ్యాంకు రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. 


"ఈ ఘటన వెనక భారీ కుట్ర ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాకపోతే మరేంటి..? ఇలాంటి వేర్పాటు వాదులకు ఆశ్రయమివ్వడం ఏమంత మంచిది కాదు. రెండు దేశాల మధ్య బంధం సన్నగిల్లుతుంది. కెనడాలోని అత్యున్నత అధికారులు వెంటనే స్పందించాలి. కావాలనే హింసను ప్రేరేపిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి"


- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి 






కాంగ్రెస్ ఫైర్..


అయితే..ఈ ఘటనపై కాంగ్రెస్ భగ్గుమంది. ఇందిరా గాంధీ హత్యను వేడుకలా జరుపుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జైశంకర్‌ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు కొందరు ట్వీట్‌లు చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఆ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. కెనడా అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.





ఈ ట్వీట్‌లతో కెనడా అప్రమత్తమైంది. భారత వ్యవహారాలు చూసుకునే కెనడా హైకమిషనర్ కామెరూన్ మ్యాకే ట్వీట్‌ చేశారు. "మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వేడుకగా జరుపుకున్న వీడియోలు చూశాను. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. హింసను ప్రేరేపించే వాళ్లకు కెనడాలో చోటు లేదు" అని తేల్చి చెప్పారు.