Ramayanam Movie: బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతోంది. ఇప్పటికే దర్శకుడు ఓమ్ రౌత్ రామాయణ ఇతిహాసాల ఆధారంగా ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరో రామాయణ సినిమా రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ త్వరలో రామాయణ కథతో సినిమా తీస్తున్నారనే వార్తలు కొన్ని నెలలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజం అవుతున్నట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైనే బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనడుస్తోంది.
సీతారాములుగా రణబీర్ కపూర్, అలియా భట్ - సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్
‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఇప్పుడీ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీత గా అలియా భట్ నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ పాత్రల గురించి గతం నుంచీ వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. తొలుత సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సాయి పల్లవి స్థానంలో అలియా భట్‌ను తీసుకున్నారని, రియల్ లైఫ్ జంటను సీతారాములుగా చూసేందుకు ప్రేక్షకులకు ఇష్టపడతారని.. అందుకే ఈ మార్పు చేశారని తెలిసింది.
ఇటీవల అలియా భట్.. దర్శకుడు నితీష్ తివారీతో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అలాగే రామాయణానికి సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రణబీర్ కపూర్ కూడా రాముడి పాత్ర లుక్ టెస్ట్ లు చేసినట్టు తెలుస్తోంది. అందుకే రణబీర్, అలియా ‘రామాయణం ఆఫీస్’కు కూడా తరచుగా వెళ్తున్నారట. ఇక్కడే నితీస్ తివారీ, నమిత్ మల్హోత్రా, మధు మంతెన బృందం ఈ మూవీ గురించి చర్చలు చేస్తున్నారట. దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే దీపావళికి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రావణుడిగా యష్..
‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ స్టార్ హీరో యష్ క్రేజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గతంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు నితీష్ తివారీ అలాగే మధు మంతెన కలసి రావణుడి పాత్ర కోసం కొన్ని నెలలుగా యష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి యష్ ఇంకా అఫీషియల్ గా ఓకే చేయనప్పటికీ కశ్చితంగా చేస్తాడని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఈ మధ్యలో యష్ వేరే పెద్ద ప్రాజెక్టులకు ఓకే చేయడంతో ఈ మూవీ చేయడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మరోవైపు ఈ సినిమా గురించి యష్ ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాడట. అందుకే యష్ ఈ ప్రాజెక్టులో భాగం అవుతారని చూస్తున్నారట. దీనిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత రానుందని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ మూవీను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ, రవి ఉద్యవార్‌తో కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ సినిమా గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
Also Read : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం