ఏపీలో బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. ఏపీలో ఎవరు గెలిచినా తాము గెలిచినట్టే అని బీజేపీలోని ఓ వర్గం చెప్పుకుంటుంది. బీజేపీ అధిష్ఠానం కూడా ఇద్దరితో సఖ్యతగానే ఉంటోందన్న ప్రచారం జోరుగా ఉంది. ఎన్నికలు వస్తున్న టైంలో టీడీపీ, బీజేపీ మధ్య బంధం బలపడుతోందన్న విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ టైంలోనే ఈసారి చంద్రబాబుతో స్నేహం వద్దనే వర్గం బీజేపీలో బలపడుతోందన్న టాక్ నడుస్తోంది.
ఇక చాలు "బాబు" వద్దు
2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య. అందుకే విజయం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబుతో స్నేహం మాత్రం వద్దని బీజేపీ స్టేట్ లీడర్లు గట్టిగా చెబుతున్నారట. ఆయన ఉంటే మిగిలిన నాయకులకు, పార్టీలకు ఎదిగేందుకు అవకాశం లేకుండాపోతోందని ఆవేదన చెందుతున్నారట. గత అనుభవాలను తెరపైకి తీసుకొస్తోందా వర్గం. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి చేరవేసినట్లుగా చెబుతున్నారు.
తెలుగు దేశంతో పొత్తు వ్యవహరంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు నో అనే చెబుతున్నారని టాక్. తెలగు దేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుపై ప్రజలకు బోర్ కొట్టేసిందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దశాబ్దాలుగా రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికి నేటి తరం ఓటర్లకు కావాల్సిన కొత్తతరం నాయకత్వం కోసం ప్రయత్నలు చేయటం ద్వార పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అనుభవం చాలు....కొత్త తరం కావాలి...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల థింకింగ్ మారిందనే అభిప్రాయం భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేస్తోంది. ఇది 2014 ఎన్నికల్లోనే కనిపించిందని అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబును ఎన్నుకున్నారని అంతా భావించినప్పటికి, ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే జగన్‌కు కూడ భారీగానే ఓట్లు నమోదయ్యాయి. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఎవరూ ఊహించని విధంగా ఓటర్లు తీర్పు వచ్చింది. 151సీట్ల సీఎంగా జగన్ మోహన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కేవలం ఐదు సంవత్సరాల్లో ఇంత భారీగా మార్పులు రావటానికి కారణం, ఓటర్లలో వచ్చిన నూతన ఒరవడి కారణమని అంటున్నారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉంటాయని బల్ల గుద్ది చెబుతున్నారు. కొత్తతరం ఓటర్లకు అవకాశాలు వచ్చాయి కాబట్టి బీజేపీతోపాటు జనసేనకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చంద్రబాబుతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే జనసేన బీజేపీకీ కూటమికి పడే ఓట్లు కూడా పడవేమో అనే అనుమానాలు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేనాని వెంట బాబు మాట....
అయితే ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు ఎస్ చెప్పేశారు. మూడు పార్టీల కూటమితో ఎన్నికలు ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పవన్ నోటి వెంట నుంచే చంద్రబాబు మాట రావటంతో బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. పొత్తులో రెండు పార్టీలు ముద్దు-మూడో పార్టీ వద్దు అనే ఆలోచనలో ఉన్న బీజేపీ నేతలు ఢిల్లీకి స్టేట్ పొలిటికల్ పరిస్థితిపై డైలీ రిపోర్ట్ పంపుతున్నారని చెబుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ హై కమాండ్ నిర్ణయం ఎలా ఉంటుంది, ఎన్నికల్లో మూడు పార్టీల వ్యూహాల మాటేంటనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.