Zomato: ఫుడ్ డెలివెరీ అగ్రిగేటర్ జొమాటో ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. ఓవైపు నష్టాలు పెరుగుతున్నాయి, లాభదాయకత తగ్గిపోతోంది. మరోవైపు, డైన్ ఔట్‌లు (హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినడం), జర్నీలు పెరగడంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. భారతదేశంలోని టాప్-8 నగరాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫ్లాట్‌ఫామ్ మొత్తం డిమాండ్‌లో ఈ టాప్-8 నగరాలదే కీలక పాత్ర.
Q3లో భారీ నష్టాలు
2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, జొమాటో రూ. 347 కోట్ల నికర నష్టాన్ని (Zomato Q3 Net loss) ప్రకటించింది. సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో (2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) పోస్ట్ చేసిన నష్టం రూ .63.2 కోట్లు. ఇదే కాలంలో ఈ ప్లాట్‌ఫాం ఆదాయం (Zomato Q3 Revenue) 75% పెరిగి రూ. 1,948 కోట్లకు చేరుకుంది. ఆదాయం భారీగా పెరిగినా, నష్టాలు కూడా కొన్ని రెట్లు పెరిగాయి.
దీంతో, ఈ ఫుడ్ డెలివెరీ కంపెనీ అప్రమత్తమైంది. తగ్గిన ఆర్డర్ విలువలను తిరిగి పూడ్చుకోవడానికి రెస్టారెంట్ల మీద పడింది. తన కమీషన్లను 2-6% (Zomato Commission) పెంచాలని చాలా రెస్టారెంట్‌లను డిమాండ్ చేసినట్లు సమాచారం.
అయితే, ఇప్పడు ఇస్తున్న కమీషన్లే చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇంకా పెంచితే తాము భరించలేమంటూ రెస్టారెంట్ ఆపరేటర్లు ఆ డిమాండ్‌ను అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో, రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. గతంలోనూ కమీషన్ల వ్యవహారంలో NRAI ఫిర్యాదుతో CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వరకు కేసు వెళ్లింది.
కమీషన్లు పెంచుకోడానికి ముంబై, దిల్లీ, కోల్‌కతా సహా కొన్ని నగరాల్లో వివిధ రెస్టారెంట్ చైన్లను జొమాటో సంప్రదించినట్లు తెలుస్తోంది. అది కూడా, ఎంపిక చేసిన రెస్టారెంట్ బ్రాండ్లకు మాత్రమే జొమాటో నుంచి కాల్ వెళ్తోంది.
ఒక వారం రోజులుగా ఈ తంతు నడుస్తున్నట్లు పేరు చెప్పని ఒక రెస్టారెంట్ ఓనర్ వెల్లడించారు. కమీషన్ పెంపునకు అంగీకరించకపోతే, ఆ రెస్టారెంట్‌ను డెలివెరీ లిస్ట్ నుంచి తీసేయచ్చు, డెలివరీ చేయగల పరిధిని తగ్గించవచ్చు, లేదా రెస్టారెంట్ పేరును జొమాటో ప్లాట్‌ఫామ్‌లో చాలా కిందకు నెట్టేయవచ్చు. ఏదైనా జరగవచ్చని రెస్టారెంట్ ఓనర్ వాపోయారు.
చర్చలు జరుపుతామన్న NRAI
దాదాపు 50 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్న 'నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (NRAI) కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టింది. రెస్టారెంట్ మెంబర్ల తరపున జోమాటోతో తాము మాట్లాడతామని వెల్లడించింది.
ఈ విషయం మీద ఒక జాతీయ మీడియా పంపిన ఈ-మెయిల్‌కు జొమాటో స్పందించింది. జొమాటోతో పాటు, జొమాటో రెస్టారెంట్ పార్టనర్లు కూడా పోటీపోటీగా, స్థిరంగా ఉండేలా తమ కమీషన్లను పునఃపరిశీలిస్తున్నట్లు చెప్పారు.
గత రెండు సంవత్సరాలుగా, రెస్టారెంట్ భాగస్వాములతో ఒప్పందాన్ని బట్టి, ఒక్కో ఆర్డర్ డెలివెరీ మీద 18-25% కమీషన్‌ను జొమాటో వసూలు చేస్తోంది. దీనినే మరో 2-6% మేర పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది.
జొమాటో కంటే ఎక్కువ కమీషన్ వసూలు చేస్తున్న స్విగ్గీతో (Swiggy) సమాన స్థాయిలో నిలిచేందుకు జొమాటో తహతహలాడుతోందని రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. అగ్రిగేటర్లకు ఇలా ఇచ్చుకుంటే పోతే బిజినెస్ మూసేసుకోవాల్సిందేనని అన్నారు.
ప్రతి ఆర్డర్‌పై లాభం పెంచుకోవాలని జొమాటో కోరుకోవడం మంచిదే. కానీ, దాని వల్ల రెస్టారెంట్లు తీవ్రంగా నష్టపోతాయని ఫుడ్ టెక్ కంపెనీ ఘోస్ట్ కిచెన్స్ పౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ తన్నా ఆరోపించారు.
అగ్రిగేటర్లు జొమాటో, స్విగ్గీతో మూడేళ్లుగా రెస్టారెంట్ భాగస్వాములకు విభేదాలు నడుస్తున్నాయి. కస్టమర్ బేస్ పెంచుకోవడానికి ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయని, ఇది తమ వ్యాపారాల్లో నిలకడ లేకుండా చేస్తోందన్నది రెస్టారెంట్ ఆపరేటర్ల వాదన. ఒక్కొక్కరి నుంచి ఒక్కోలా కమీషన్ వసూలు చేయడంతో పాటు, డేటాను కూడా ఈ రెండు కంపెనీలు తారుమారు చేస్తున్నాయని చెబుతున్నారు.