March 2023 New Rules: రేపటి (బుధవారం) నుంచి, కొత్త సంవత్సరంలో మూడో నెల అయిన మార్చి ప్రారంభం అవుతుంది. కొత్త నెల ప్రారంభ రోజు నుంచి కొన్ని విషయాలు మారతాయి, కొత్త నియమాలు అమల్లోకి (Rules Changing From 1st March 2023) వస్తాయి. ఆ మార్పులు మీ జేబు మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. మార్చి నుంచి.. బ్యాంక్ సెలవు రోజులు మొదలుకుని (Bank Holiday List of March 2023) వంట గ్యాస్ సిలిండర్‌ల ధర, బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు మొదలైన చాలా విషయాలు మారబోతున్నాయి. మార్చి 1, 2023 నుంచి ఏ ఆర్థిక విషయాలు, నియమాలు మారుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మార్చిలో బ్యాంకు సెలవు రోజులు
2023 మార్చి నెలలో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. హోలీ, చైత్ర నవరాత్రి, శ్రీ రామ నవమి వంటి కీలక పండుగలు ఈ నెలలోనే జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో, మార్చి నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు రోజులు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో రెండో & నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులు, ఆచారాలను బట్టి ఈ సెలవులు మారతాయి. కాబట్టి, బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనిని మార్చి నెలలో మీరు పూర్తి చేయాల్సి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చూడడం ముఖ్యం. లేకపోతే, మీ ముఖ్యమైన పని ఆగిపోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేయవన్న విషయాన్ని ఈ కింది లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు, ఇదిగో లిస్ట్
2. బ్యాంకు రుణ వడ్డీ రేట్లు పెరగవచ్చు
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతోంది. ఫిబ్రవరి నెలలోనూ రెపో రేటు పెరిగింది, మొత్తం 6.5 శాతానికి చేరింది. RBI రెపో రేటు పెంపు తర్వాత చాలా బ్యాంకులు తమ MCLRను పెంచాయి. ఈ పెంపును బ్యాంకులు ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. ఇది అన్ని వర్గాల ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్ల పెంపు కారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం తదితరాల వడ్డీ రేటు, నెలనెలా చెల్లించాల్సిన EMI మొత్తం కూడా పెరుగుతుంది.
3. CNG మరియు LPG ధరలు పెరగవచ్చు
వంట గ్యాస్ (LPG), వాహనాల్లో వినియోగించే గ్యాస్ (CNG) ధరలను ప్రతి నెల ప్రారంభంలో నిర్ణయిస్తారు. ఫిబ్రవరి నెలలో ఎల్‌పీజీ ధరలో ఎలాంటి పెంపుదల లేదు. కాబట్టి, ఈసారి వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
4. రైలు టైమ్ టేబుల్‌లో మార్పులు
వేసవి ప్రారంభం కారణంగా, భారతీయ రైల్వే, రైళ్ల టైమ్ టేబుల్‌ను మార్చింది. 2023 మార్చి 1 నుంచి, 5,000 సరుకు రవాణా రైళ్లు & వేలాది ప్యాసింజర్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మీరు మార్చి నెలలో రైలు ప్రయాణం చేయాల్సి వస్తే, మీరు ఎక్కవలసిన రైలు సమయాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయడం మరిచిపోవద్దు.
5. సోషల్ మీడియా నిబంధనలు, షరతుల్లో మార్పులు
భారత ప్రభుత్వం ఇటీవల ఐటీ నిబంధనలను సవరించింది. ఇప్పుడు... ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్‌లు కొత్త భారతీయ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మతపరమైన మనోభావాలను ప్రేరేపించే పోస్ట్‌లను కొత్త విధానం అడ్డుకుంటుంది. ఈ కొత్త రూల్ మార్చి నుంచి అమల్లోకి రావచ్చు. తప్పుడు లేదా అసత్య సమాచారంతో పోస్ట్‌లు పెట్టే వ్యక్తులపై జరిమానా విధించవచ్చు.