Most Powerful Passports in 2024: భారతీయ పాస్‌పోర్ట్ బలం మరోసారి పెరిగింది. ఈ ఏడాది, గ్లోబల్‌ ర్యాంక్‌ల్లో ఇండియన్ పాస్‌పోర్ట్ 3 స్థానాలు ఎగబాకింది, ప్రపంచంలోనే 80వ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. 


వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లొచ్చు (Visa-free access for 62 countries)
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ‍‌(Henley Passport Index) తాజా ఎడిషన్‌లో, ఉజ్బెకిస్తాన్‌తో పాటు భారత్‌ 80వ స్థానంలో (India has the 80th most powerful passport in the world) నిలిచింది. మన పాస్‌పోర్ట్‌తో భారతదేశ ప్రజలు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఆ దేశాల్లో.. భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌, బార్బడోస్, థాయిలాండ్, జోర్డాన్, మలేషియా, మాల్దీవులు, శ్రీలంక, మారిషస్, ఇండోనేషియా వంటివి ఉన్నాయి.


ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి తీసుకున్న ప్రత్యేక సమాచారం ఆధారంగా, లండన్‌కు చెందిన హెన్లీ & పార్ట్‌నర్స్ ఈ సూచీని రూపొందించింద. గ్లోబల్ మొబిలిటీలో ఇటీవలి మార్పులను ఈ ఇండెక్స్‌ ప్రతిబింబిస్తుంది.


ఈ దేశాలకు వెళ్లిన తర్వాత వీసా తీసుకోవచ్చు
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 'వీసా ఆన్ అరైవల్' (Visa on arrival) సౌకర్యం కూడా ఉంది. అంటే.. వీసా లేకుండా విదేశానికి వెళ్లిన తర్వాత, అక్కడి విమానాశ్రయంలో వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అక్కడికక్కడే, విమానాశ్రయంలోనే ఆ దేశ వీసా లభిస్తుంది. దీనినే 'వీసా ఆన్ అరైవల్' అంటారు. ఈ దేశాల లిస్ట్‌లో.. కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మయన్మార్, తైమూర్-లెస్టే, ఇరాన్, బొలీవియా, బురుండి, కేప్ వెర్డే ఐలాండ్స్‌, కొమొరో ఐలాండ్స్‌, జిబౌటీ, గాబన్, మడగాస్కర్, సీషెల్స్, మారిషస్, మొజాంబిక్, సియెర్రా లియోన్, సోమాలియా, టాంజానియా, జింబాబ్వే ఉన్నాయి.


భారతదేశం తర్వాత ఉన్న దేశాలు
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో, 2023లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 83గా ఉంది. 2024లో 80కి మెరుగుపడింది. భారత్‌ తర్వాత... భూటాన్, చాద్, ఈజిప్ట్, జోర్డాన్, వియత్నాం, మయన్మార్, అంగోలా, మంగోలియా, మొజాంబిక్, తజికిస్తాన్, మడగాస్కర్, బుర్కినా ఫాసో, కోట్ డి ఐవరీ, ఈక్వటోరియల్ గినియా, సెనెగల్, అల్జీరియా, కంబోడియా, మాలి దేశాలకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ర్యాంక్‌లు దక్కాయి.


ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌లు
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల విషయానికి వస్తే... ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉమ్మడిగా టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా 194 దేశాలను సందర్శించవచ్చు. వీటి తర్వాత... ఫిన్‌లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పార్ట్‌తో ప్రపంచంలోని 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ ఉంది. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్‌పోర్ట్‌లు సంయుక్తంగా థర్డ్‌ ర్యాంక్‌లో ఉన్నాయి, ఈ పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.


అత్యంత బలహీనంగా పాకిస్థాన్ పాస్‌పోర్ట్
డొమినికా, హైతీ, మైక్రోనేషియా, ఖతార్, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్, టొబాగో, వనాటు పాస్‌పోర్ట్‌లు అత్యంత బలహీన పాస్‌పోర్ట్‌లుగా నిలిచాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌ది ప్రపంచంలోనే నాలుగో బలహీనమైన పాస్‌పోర్ట్. ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్‌లు కూడా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అథమ స్థానంలో ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌లకు వరుసగా 5 రోజులు సెలవులు, శనివారం నుంచి ప్రారంభం