Srikakulam YSRCP News: వైఎస్‌ఆర్‌సీపీ గురువారం విడుదల చేసిన జాబితాలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మాత్రం గతంలో పోటీ చేసిన వారిని చాలా మందిని తప్పించి వారి సీట్లును తారుమారు చేశారు. కచ్చితంగా మరోసారి జిల్లాలో పట్టు సాధించాలన్న ప్లాన్‌తోనే ఈ మార్పులు జరిగాయని అంటున్నాయి వైసీపీ వర్గాలు
వైసీపీ రాత్రి రిలీజ్ చేసిన జాబితాతో ప్రధాన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల టెన్షన్ పోయింది. ఈ లిస్ట్‌లో చాలా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పేరు ప్రకటించారు. ఇచ్ఛాపురంలో పిరియా విజయ వైపే వైసీపీ అధినాయకత్వం మొగ్గింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీసుకు టెక్కలి అసెంబ్లీ సీటు ఖరారు చేసింది.
చర్చోపచర్చలు, మేధోమథనం చేసిన వైసీపీ అధిష్ఠానం జిల్లా చాలా మార్పులు చేసింది. మూడు ప్రధాన టిక్కెట్లు ఖరారు చేసింది. పేరాడ తిలక్ పేరు టెక్కలి అసెంబ్లీ స్థానం కోసం చివరి వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎంపీగా ఎంపిక చేసింది. కళింగ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థినే నిలపాలన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొన్నాళ్ల టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పని చేసిన దువ్వాడ శ్రీనునే మళ్లీ ఇక్కడ నిలబెట్టనున్నారు. మధ్యలో ఆయన భార్య దువ్వాడ వాణిని ఇన్ఛార్జిని చేశారు. ఆమెకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా శ్రీనే తెరపైకి వచ్చారు. ఇచ్ఛాపురం సెగ్మెంట్ విషయంలో గురువారం రాత్రి వరకు ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. రెడ్డిక సామాజికవర్గానికి టిక్కెట్ ఇవ్వాలనే నినాదం ఊపందుకుంది. గతంలోనే హామీ పొందిన పిరియా సాయిరాజ్ దంపతులను ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తింది. కానీ జగన్ పిరియా విజయ అయితేనే అక్కడ గెలుస్తారన్న భావనతో ఆమెకే టికెట్ కన్ఫామ్ చేశారు. మూడో విడత ప్రకటించిన జాబితా మాత్రం జిల్లా వరకు ఇదే సంచలనాత్మకమైనదే.
నారాయణమ్మకు ఊహించని ప్రమోషన్
జిల్లాలో అన్ని సామాజికవర్గాల ఓటు పోలరైజేషన్ కోసం మరో నిర్ణయం వైసీపీ తీసుకుంది. జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న పిరియా విజయను అసెంబ్లీ టికెట్ ఇస్తున్నందున ఆమె స్థానంలో జడ్పీ అధ్యక్ష పదవిని ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉప్పాడ నారాయణమ్మకు కేటాయించారు. ఆమె రెడ్డిక సమాజిక వర్గానికి చెందిన నేత. అలా వారిని సంతృప్తి పరిచారు.
పేరాడ, దువ్వాడ.. అటూ ఇటూ మార్పు
2019 సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయగా, పేరాడ తిలక్ టెక్కలి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఈసారి వీరిద్దరి స్థానాలు తారుమారయ్యాయి. తిలక్ ఎంపీకి పోటీ పడుతుంటే, శ్రీను టెక్కలి ఎమ్మెల్యేగా బరిలో నిలువనున్నారు. మూలపేట పోర్టు శంకుస్థాపనకు గత ఏడాది ఏప్రిల్ 19న టెక్కలి నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికల వేడి రాజుకోకముందే టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనేనని ఆశీస్సులు అందించాలని కోరారు.
తర్వాత కుటుంబ రాజకీయాలతో శ్రీను స్థానంలో భార్య దువ్వాడ వాణి వచ్చారు. అప్పుడు కూడా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి దువ్వాడ వాణి అని ముఖ్యమంత్రి ఎక్కడా ప్రకటించలేదు. స్వయంగా వాణి భర్త శ్రీనుతోనే విలేకరుల సమావేశం పెట్టించి చెప్పించారు. చివరకు టిక్కెట్లు ఖరారు చేసే సమయానికి శ్రీనునే కొనసాగించడం కొసమెరుపు.
నందిగాం మండలంతోపాటు మరికొన్ని మండలాల్లో గట్టి పట్టున్న తిలక్‌ను పక్కన పెట్టి టెక్కలి గెలుచుకోవడం సులభం కాదన్న సూచినతో ఆయనకు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చారు. 2019లో టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు మీద 8,545 ఓట్ల తేడాతో తిలక్ ఓడిపోగా, దువ్వాడ శ్రీను టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మీద 6,653 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే టెక్కలి అసెంబ్లీ సీటును దక్కించుకోవడంతో పాటు జిల్లా వ్యాప్తంగా కాళింగ ఓట్లు పోలరైజ్ అవుతాయన్నభావనలో ఉంది వైసీపీ.
దువ్వాడ శ్రీను 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏడు నియోజకవర్గాల పరిధిలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎంపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోవచ్చిన తేడా వల్లే దువ్వాడ శ్రీను ఓడిపోయారు. ఇప్పుడు పేరాడ తిలక్‌ను సామాజికవర్గంతోపాటు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో బలం ఉంది. పార్టీ అభ్యర్థులందరితోనూ సమన్వయం ఉంది. 2013లోజరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలాసలో ఆయన తన భార్య పేరాడ భార్గవిని పోటీలో పెట్టి అనువుకానిచోట గెలిపించుకున్నారు.
ఒకవైపు ధర్మాన సోదరులతో ఎలా ఉంటారో, మరోవైపు సీతారాం, మంత్రి అప్పలరాజుతో కూడా అదే స్థాయిలో తిలక్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జి బొత్స సత్యనారాయణ, ఐప్యాక్ సర్వేలు పేరాడ వైపే మొదట్నుంచి మొగ్గు చూపుతున్నాయని పార్టీలో టాక్ ఉంది. ఈ కోణంలో ఆయన్ను విస్మరించి కళింగ సామాజికవర్గ ఓట్లను తెచ్చుకోలేమన్న భావనతో ఎంపీగా పేరును ఖరారు చేశారు. మూడో విడత జాబితాలో ప్రకటించిన మరికొంతమంది అభ్యర్థులు కూడా స్థానమార్పులు, కొత్తవారు వచ్చి చేరారు. వైసీపీలో మొదట్నుంచి ఈ ఎన్నికలకు అనుసరిస్తున్న వ్యూహం ఇదే.