Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి పున:ప్రవేశం చేయబోతున్నారా..? ఆయన కానీ ఆయన కుమారుడు గిరిరావు కానీ ఇంతకీ ఏ పార్టీ నుంచి ముందుకు రానున్నారు..? మొన్నటి వరకు వైసీపీ నాయకుల మంతనాలు.. ఇప్పుడు తాజాగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న కాపు నాయకులు వరుసగా ముద్రగడను కలవడం ముద్రగడ రాజకీయ రంగప్రవేశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ముద్రగడ మాత్రం తన మౌనం వీడడం లేదు. ఆయన అసలు రాజకీయ పరిస్థితులపై మాట కూడా మాట్లాడడం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమారుడు మాత్రం నాన్న ఆదేశిస్తూ పోటీకి సిద్ధం అంటూ ప్రకటించారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకులకు దూరంగా ఉన్న ముద్రగడ కుటుంబం జనవరి ఒకటో తేదీన ముద్రగడ పద్మనాభం తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వచ్చిన వారందరికీ అందుబాటులో ఉండి అందరినీ కలవడం ముద్రగడ పద్మనాభం రాజకీయ పున:ప్రవేశం కచ్చితమే అంటున్నారు.


జనసేనలోకి రావాలంటూ పవన్‌ ఆహ్వానం..


ముద్రగడ పద్మనాభం కుటుంబం జనసేన పార్టీలోకి రావాలంటూ జనసేనకు చెందిన కాపు ముఖ్య నాయకులు ముద్రగడ పద్మనాభంను కలిసి కోరినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాసిన లేఖను ముద్రగడకు అందించారు. బలిశెట్టి శ్రీనివాస్‌తోపాటు పలువురు జనసేన నాయకులు వచ్చి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తానని చెప్పారని జనసేన నాయకులు చెబుతున్నారు.


వైసీపీలోకి వస్తున్నారంటూ ప్రచారం..


గత రెండు నెలలుగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్‌ ఎంపీ మిథున్‌ రెడ్డి ముద్రగడను కలిసి చర్చలు జరిపారు కూడా.. త్వరలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో వస్తున్నారని, ఆయన్ను కానీ ఆయన కుమారుడిని కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్‌గా కాకినాడ ఎంపీ వంగా గీతను ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. ఈ క్రమంలోనే మళ్లీ కాకినాడ ఎంపీగా ముద్రగడను రంగంలోకి దింపుతారని మరో రకం ప్రచారం ఊపందుకుంది. కానీ అటు వైసీపీ నుంచి కానీ, ఇటు ముద్రగడ నుంచి కానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా జనసేన నాయకులు ముద్రగడను కలవడం, అదే విధంగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభంను కలవడం అసలు ఆయన ఏ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారన్నది అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఆయన కుమారుడు మాత్రం నాన్నగారు ఏం ఆదేశిస్తే ఆప్రకారమే ముందుకు వెళ్తామని చెబుతున్నారు. 


లేఖలతో విమర్శనాస్త్రాలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉండగా కాపులను పోలీసులతో అణిచి వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, అంతేకాకుండా ఉద్యమాన్ని భుజానికెత్తుకుని కాపుల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్న తనను అనేక విధాలుగా వేధించారని, కాపు ఓటు బ్యాంకుతో గద్దెనెక్కి ఆతరువాత కాపులను మర్చిపోయారని ఆయన సంధించిన లేఖలో పలు అంశాలను సూటిగా ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ ఆయన తన లేఖల ద్వారా చంద్రబాబును ప్రశ్నించారు. అదేవిధంగా ఒకదశలో చంద్రబాబు కాపులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు.


అదేవిధంగా పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర సందర్భంగా కాకినాడ బహిరంగ సభలో పరోక్షంగా ఓ పెద్దాయన అంటూ చేసిన విమర్శలపైనా అంతే ఘాటుగా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ కాపులను నమ్మించి వంచన చేసిన చంద్రబాబుతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కాపులకు జగన్‌ ప్రభుత్వం అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ ద్వారా సూచించారు. ఈనేపథ్యంలోనే ఒక దశలో ముద్రగడ వైసీపీకు అనుకూలంగా ఉన్నారన్నచర్చ జరిగింది. ఇంతకీ ముద్రగడ ఏపార్టీలో చేరతారు అన్న సందిగ్ధత కొనసాగుతుండగా ఆయన మౌనం వీడి ముందుకు వస్తేనే తెలిసే అవకాశాలున్నాయి.