Andhra Pradesh News : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే... ఈ సారి వైసీపీ (YCP)కొట్టి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) అడుగులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో మళ్లీ పొత్తుపెట్టుకున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ రెండు జాబితాలను ప్రకటించింది. మూడో లిస్టు నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను కన్ఫాం చేసింది. జనసేన మాత్రం ఇప్పటి వరకు ఎవర్ని ప్రకటించలేదు. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండటంతో...చర్చల తర్వాత ప్రకటించాలని భావిస్తోంది.
ముద్రగడ యాక్టివ్ మళ్లీ అవుతారా ?
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటు అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ఏ పార్టీలోనూ లేనప్పటికీ...కాపులంతా ఆయన వైపే ఉన్నారు. దీంతో పార్టీలు ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తాజాగా నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభంతో జనసేన నేతలు బోలిశెట్టి శ్రీనివాస్, తాతాజీలు సమావేశం అయ్యారు. జనసేనలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. త్వరలోనే పవన్ కల్యాణ్ తోనూ సమావేశం కానున్నారు ముద్రగడ. జనసేన నేతలతో ముద్రగడ భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న ప్రచారం మొదలైంది. మొన్నటి దాకా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకు పార్లమెంట్ టికెట్, తనయుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైందని, ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఏ పార్టీలో చేరే అంశంపై ముద్రగడ పద్మనాభం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మౌనంగా ఉండిపోయారు.
ఒకరి తర్వాత మరొకరు భేటీ
ముద్రగడ పద్మనాభంను నిన్న జనసేన నేతలు కలిస్తే....ఇప్పుడు టీడీపీ నేతలు కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కాసేపట్లో ముద్రగడ ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాపులంతా ఐక్యమత్యంగా ఉండాలని, అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే అంశాన్ని ముద్రగడకు తెలిజేయనున్నారు. అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు వరుస సమావేశాలతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ముద్రగడ కేంద్రంగా కాపు రాజకీయాుల మళ్లీ మొదలయ్యాయా ? కాపులను ఆకర్షించే పనిలో పార్టీలు పడ్డాయా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తన అనుచరులు ఉండేలా
ముద్రగడ ఏ పార్టీ చేరినా...తూర్పు గోదావరి జిల్లా మొత్తం తాను ప్రతిపాదించిన వ్యక్తులనే నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా...ఆ పరిస్థితి ఉండదు. వైసీపీలో ఖాళీలు ఉన్నందున తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవచ్చన్న ఆలోచనలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న ముద్రగడ...జనసేనలో చేరుతారా ?లేదంటే మద్దతు మాత్రమే ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జనసేన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ...లేఖలు విడుదలు చేశారు. దీంతో ముద్రగడ రాజకీయ అడుగులు ఎటు ? మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా ? పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ ? ఏ పార్టీ తరపున అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది.