Sankranthi Special Buses: సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి కోసం ప్రత్యేక బస్సులు నడుపనుంది. హైదరాబాద్‌(Hyderabad) నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్‌ బస్సులను నడపాలని ఏసీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్‌(Sankranti) కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్‌ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్‌ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్‌ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.


ఈ ప్రాంతాలకు బస్సులు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మెరుగైనసేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూ­లు, అనంతపురం, తిరుపతి, నెల్లూ­రు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు. అలాగే బెంగళూరు, చెన్నైల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు­లు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 


ఏపీకి కలిసొచ్చిన తెలంగాణ ఫ్రీ బస్ పథకం
ఏటా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేది. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందంలో భాగంగా సర్వీసులను రెండు రాష్ట్రాలకు చెందిన బస్సులు నడిచేవి. అయితే ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. దీంతో అంచనాలకు మించి మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఈ అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది. పండుగకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేందుకు అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. 


అవును బస్సులు తగ్గించాం
మహాలక్ష్మి స్కీం కారణంగా ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించినట్లు  టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సంక్రాంతి పండుగ కోసం 4,484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఆయయన తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ నుంచి మాత్రమే కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. 


ఇప్పటికే 6700 బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 6,700 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి శనివారం నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. సంక్రాంతికి ముందు ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య రెగ్యులర్‌ సర్వీసుల్లో ముందుస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.


ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని, ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని పలు పాయింట్లలో సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల సమాచారంకోసం, ఏవైనా సమస్యలు ఉన్నా కాల్‌ సెంటర్‌ నంబరు 149కి గానీ, 0866-2570005 నంబరుకు గాని ఎప్పుడైనా ప్రయాణికులు ఫోన్‌ చేయవచ్చని వెల్లడించారు. ఈ నెల 18 వరకు ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని అధికారులు వెల్లడించారు.