Windfall Tax: చమురు సంస్థల తాట తీసే విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం మరోమారు పెంచింది. ప్రతి 15 రోజులకు ఒకసారి విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం సమీక్షించి, మార్పులు చేస్తుంది.
విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ అంటే..
ఒక సంస్థ లేదా పరిశ్రమకు పెద్ద మొత్తంలో, ఆకస్మికంగా వచ్చి పడిన లాభాల మీద విధించే అదనపు పన్నే విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్. అలాంటి లాభాలు వస్తాయని సదరు సంస్థ లేదా ఇండస్ట్రీ ఊహించి ఉండదు. పరిస్థితులు అనూహ్యంగా మారిన సందర్భంలో ఆకస్మిక లాభాలను అవి ఆర్జిస్తాయి. అంటే.. అదనపు పెట్టుబడి లేదా శ్రమ అవసరం లేకుండా గాలివాటంగా వచ్చే లాభాలన్నమాట. అందుకే వాటిని విండ్‌ఫాల్ ప్రాఫిట్స్ లేదా ఆకస్మిక లాభాలుగా చెబుతారు. ఇలాంటి అనూహ్య లాభాలను ఆర్జించిన కంపెనీ లేదా ఇండస్ట్రీ మీద, రెగ్యులర్ కార్పొరేట్ టాక్స్‌లకు అదనంగా విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇది, ఆ కంపెనీ లేదా ఇండస్ట్రీకి అదనపు భారం.
దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురు ఎగుమతుల మీద విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను బుధవారం నుంచి (నవంబర్ 17, 2022) కేంద్ర ప్రభుత్వం పెంచింది.
ప్రభుత్వ రంగంలోని 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్' (ONGC), ఆయిల్ ఇండియా (Oil India), గెయిల్ (GAIL); ప్రైవేటు రంగంలోని 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (Reliance Industries Limited) వంటి సంస్థల మీద ఈ పన్ను పెంపు ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఇవి విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ చెల్లిస్తున్నాయి. టాక్స్ హైక్ తర్వాత, ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను ప్రతి టన్నుకు రూ. 9,500 నుంచి రూ. 10,200 కి పెరిగింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం, బ్యారెల్ ముడి చమురు 100 డాలర్లకు చేరువలో ఉంది. మూడు నెలల క్రితం ఇది 140 డాలర్లను కూడా టచ్ చేసింది. మన దేశం నుంచి ముడి చమురు ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తి సంస్థలు అదనపు పెట్టుబడి లేదా శ్రమ లేకుండానే కొన్ని త్రైమాసికాలుగా అతి భారీ లాభాలను అనుభవిస్తున్నాయి. ఆ లాభాల్లో కొంత వాటాను విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది.
డీజిల్ ఎగుమతిపై పన్ను తగ్గింపు
పక్షం రోజుల రివిజన్‌లో... డీజిల్ ఎగుమతిపై లీటరుకు కట్టాల్సిన పన్నును రూ. 13 నుంచి రూ. 10.5 కి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డీజిల్‌పై విధించే పన్నులో లీటర్‌కు రూ. 1.50 రోడ్డు మౌలిక సదుపాయాల సెస్ ఉంటుంది.
నవంబర్ 1న జరిగిన చివరి సమీక్షలో. విమాన ఇంధనం లేదా ATF (Aviation Turbine Fuel) మీద ఎగుమతి పన్నును లీటరకు రూ. 5గా కేంద్ర నిర్ణయించింది. దానినే నవంబర్ 17 నుంచి కూడా కొనసాగించింది.
ఈ ఏడాది జులై 1న మొదటిసారి విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇంధన కంపెనీల సూపర్ నార్మల్ లాభాల మీద పన్ను విధించే దేశాల జాబితాలో చేరింది.
లెవీని మొదట ప్రవేశపెట్టినప్పుడు.. డీజిల్, ATFతో పాటు పెట్రోల్ ఎగుమతిపై కూడా విండ్‌ఫాల్ టాక్స్ విధించారు. ఆ తర్వాత 15 రోజుల సమీక్షలో దానిని రద్దు చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
విండ్‌ఫాల్ టాక్స్ పెరిగింది కాబట్టి... ONGC, Oil India, GAIL, Reliance Industries ఆదాయాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ కంపెనీల లాభాల మీదా ఆ ప్రభావం కనిపిస్తుంది.