తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫార్మసీ రెండో విడత కౌన్సెలింగ్ నవంబర్ 17 నుంచి మొదలుకానుంది. బీఫార్మసీ, ఫార్మాడీ, బీటెక్ బయో టెక్నాలజీ, బయో మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 17న ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. నవంబరు 18న ధ్రువపత్రాల పరిశీలన,  నవంబరు 17 నుంచి 19 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వారికి నవంబర్ 22న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 22 - 24 మధ్య ట్యూషన్ ఫీజుతోపాటు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నవంబరు 22 - 25 మధ్య సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. కళాశాలలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి సీటు కేటాయింపును ధ్రువీకరిస్తారు. 


షెడ్యూలు ఇలా..


🔰 నవంబరు 17న: ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.


🔰 నవంబరు 18న:  ధ్రువపత్రాల పరిశీలన.


🔰 నవంబరు 17 నుంచి 19 వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు. 


🔰 నవంబరు 22న: సీట్ల కేటాయింపు. 


🔰 నవంబర్‌ 22 నుంచి 25 వరకు: సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్‌.



Counselling Website


తెలంగాణ ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు నవంబరు 9న పూర్తయింది. బీఫార్మసీలో 116 కాలేజీల్లో 7,586 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 7,433 భర్తీ కాగా మరో 153 మిగిలాయి. ఫార్మ్-డీలో 60 కాలేజీల్లో 13,121 సీట్లు ఉండగా అన్నీ భర్తీ అయ్యాయి. బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో 164 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు వర్సిటీల్లో సీట్లన్నీ మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత నవంబరు 22 నుంచి 25లోగా కాలేజీల్లో చేరాలి.


:: Also Read ::


తెలంగాణలో మరో 8 మెడిక‌ల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చవల్‌గా ఒకేసారి 8 మెడికల్ కాలేజీలలో విద్యా బోధన తరగతులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

ఈ ఒక్క విద్యా సంవత్సరం (2022-23)లోనే 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభమైనవి. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే త్వరలో కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..