Budget 2024-25: ఒకపక్క దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకిన వేళ మరోపక్క కేంద్రంలో కొత్త ప్రభుత్వం రావటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటికి తోడు త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీలు తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న వేళ ఏ కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేయాలనే ఆలోచనలో చాలా మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.


ఈ క్రమంలో సెంట్రమ్ బ్రోకరేజ్ సంస్థకు చెందిన నిపుణులు నిశ్చల్ మహేశ్వరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్లో ఇన్వెస్టర్లు, ట్రేడర్ల చూపు ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ పై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో తయారీ, రక్షణ, రైల్వే రంగాలపై ప్రభుత్వం ఫోకస్ ఉంటుందని అంంచనాలు ఉన్నాయి. మార్కెట్‌లో అండర్‌వాల్యుయేషన్ పోయిందని అందువల్ల ప్రైస్ టూ ఎర్నింగ్స్ రేషియోలో ఎటువంటి మెరుగుదల కనిపించకపోవచ్చని నిశ్చల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ వేగంగా ర్యాలీ కొనసాగిస్తోంది. ఈ బుల్ జోరుతో డిసెంబర్ నాటికి నిఫ్టీ సూచీ 24,000-24,500 స్థాయిని తాకవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ రోజు సైతం నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు తమ కొత్త జీవితకాల గరిష్ఠాలను తాకటం ర్యాలీ అంచనాలకు బలం చేకూరుస్తోంది. 
 
ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ, తయారీ రంగాలపై దృష్టి పెట్టిందని, ఇది విలువను సృష్టించడం కొనసాగుతుందని మహేశ్వరి అన్నారు. అలాగే 2-3 సంవత్సరాల పెట్టుబడి హోరిజోన్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రీస్‌పై మహేశ్వరి తన సానుకూలతను వ్యక్తం చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ఒత్తిడి సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలదని, కనీస మద్దతు ధర (MSP) పెరుగుదల ప్రకటనతో కూడా ఇది కనిపిస్తోంది. జూన్ 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2024-25లో ఖరీఫ్ పంటలకు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను అందించడానికి అన్ని తప్పనిసరి ఖరీఫ్ పంటలకు MSP పెంపునకు ఆమోదం తెలిపింది.


ఇదే క్రమంలో గ్రామీణ డిమాండ్ మెరుగుపడుతున్న వేళ ఎఫ్ఎమ్సీజీ రంగంలోని డాబర్, ఇమామీ, హిందుస్థాన్ యూనీలివర్ వంటి కంపెనీల షేర్లు కొనుగోలుకు అనుకూలంగా బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇక రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిని కొనసాగిస్తున్న వేళ ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఆ రంగంలోని కంపెనీలు లాభపడేందుకు దోహదపడతాయని చెప్పారు. అలాగే ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలో నిర్థిష్ట కంపెనీ షేర్లపై పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమంగా పేర్కొన్నారు. 


ఇదే క్రమంలో త్వరలో దేశీయ లిస్టెడ్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న వేళ క్రెడిట్ ఖర్చులు ఎక్కువగా ఉన్నందున బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు ఉత్తమ పనితీరును కనబరిచే అవకాశం ఉందని బ్రోకరేజ్ అభిప్రాయపడింది. ఇదే క్రమంలో మెుదటి త్రైమాసికంలో ఐటీ రంగంలోని కంపెనీల మ్యూటెడ్ ఆదాయాలను ప్రకటించొచ్చని అంచనా వేసింది. దీనికి తోడు ఈ ఏడాది అమెరికాలో ఎన్నికలు కొనసాగుతున్నందున దేశీయ స్టాక్ మార్కెట్లలో కొంత అనిశ్చితి కొనసాగుతుందని పేర్కొంది.  
 
రానున్న త్రైమాసికాల్లో సిమెంట్ రంగంలోని కంపెనీలతో పాటు మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు కొంత స్వల్ప మందగమనాన్ని చూడొచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. తయారీకి సంబంధించినంతవరకు త్రివేణి టర్బైన్ వంటి పవర్ కంపెనీలను కొనసాగించాలని పెట్టుబడిదారులకు ఆయన సూచించారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం రెడీగా ఉంచుకున్న మెుత్తంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేసి మిగిలిన మెుత్తాన్ని డిప్స్‌లో కొనుగోళ్ల కోసం వినియోగించటం ఉత్తమంగా మహేశ్వరి పేర్కొన్నారు.  


Note: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది బ్రోకరేజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, స్టాక్ ఆప్షన్స్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు భారీ నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ విచక్షణను వినియోగించండి లేదా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.