రోజులు మారుతున్న కొద్ది షాపింగ్ ట్రెండ్స్ కూడా అప్‌డేట్ అవుతున్నాయి. మొన్నటి దాకా డబ్బులు, క్రెడిట్ కార్డు.. నిన్న ఈఎంఐ.. ఇవాల బీఎం‌పీఎల్. అంటే ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బై నౌ, పే లేటర్) అని అర్థం. ప్రస్తుతం ఉన్న ఈ-కామర్స్ వెబ్ సైట్లు, స్టారప్ కంపెనీలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు కూడా ఈ బీఎం‌పీఎల్ విధానాన్నే పాటిస్తున్నాయి. దీని ద్వారా మనకు కావాల్సిన వస్తువులు, సరుకులను డబ్బులు చెల్లించకుండానే కొనుగోలు చేసుకుని.. తర్వాత కట్టవచ్చు. 


థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు..
సెజెల్ (Sezzle), ఆఫ్టర్ పే (Afterpay), క్వాడ్ పే (Quadpay), క్లార్నా (Klarna), పేబ్రైట్ (Paybright) వంటి చాలా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు కూడా తమ కస్టమర్లకు ఈ బీఎం‌పీఎల్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీలు మన షాపింగ్ పేమెంట్లను ఈఎంలుగా మార్చుకునే వెసులుబాటును కూడా అందిస్తున్నాయి. దీనికి కొన్ని థర్డ్ పార్టీలు యూజర్ల నుంచి వడ్డీ వసూలు చేస్తుండగా.. మరికొన్ని ఉచితంగా అందిస్తున్నాయి. పలు బ్యాంకులు సైతం తమ యూజర్లకు బీఎం‌పీఎల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 



KYC కీలకం.. 
ఈ బీఎం‌పీఎల్ పేమెంట్లకు కేవైసీ (Know Your Customer) అవసరం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ నంబర్లు నమోదు చేయాలి. బీఎం‌పీఎల్ విధానం ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే వాటికి సంబంధించిన చెల్లింపులను 15 నుంచి 45 రోజుల వ్యవధిలో చేయవచ్చు. మనం ఎంచుకున్న గడువు తేదీకి బ్యాంకు అకౌంట్ నుంచి ఆటోమెటిక్‌గా డబ్బు డెబిట్ అవుతుంది. నిర్ణీత వ్యవధిలోగా మనం చెల్లించకపోతే.. అపరాధ రుసుమును బ్యాంకు వసూలు చేసుకుంటుంది.  


పేమెంట్లు ఎలా జరుగుతాయి?
ఉదాహరణకు ఒక వెబ్‌సైట్ నుంచి మనం రూ.1000 విలువైన వస్తువులను షాపింగ్ చేశామని అనుకుందాం. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిందామని అనుకున్నాం. దీనికోసం మనం ఒక థర్డ్ పార్టీని ఎంచుకుని పేమెంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో థర్డ్ పార్టీలు 6 శాతం కమీషన్ తీసుకుని.. మిగతా మొత్తాన్ని అంటే రూ.940ని  సదరు ఈ-కామర్స్ వెబ్‌సైట్ కు చెల్లిస్తాయి. 


దీనిని ఏయే సంస్థలు ఇస్తున్నాయి?
అమేజాన్ పే లేటర్, ఫ్లిప్ కార్ట్ పే ఈ విధానాన్ని బాగా ప్రోత్సహించాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిన్ టెక్, ఫోన్ పే, పేటీఎం కూడా బీఎం‌పీఎల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా కూడా ఓలా పెయిడ్ రూపంలో ఈ విధానాన్ని తీసుకొచ్చింది.


Also Read: Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. రూ.400 మేర దిగొచ్చిన వెండి.. పలు నగరాలలో తాజా రేట్లు ఇవే..