జీవనశైలి, ఆర్థిక వ్యవస్థలలో టెక్నాలజీ కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. పర్యావరణాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నొక్కి చెప్పారు. సహజ వనరులను టెక్నాలజీ సాయంతో వినియోగించుకునే ఆవిష్కరణలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. 


పర్యావరణాన్ని కాపాడటానికి ఉద్దేశించిన వెహికల్ స్కాపేజ్ పాలసీని మోదీ ప్రారంభించారు. ఈ పాలసీ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయి లాంటిదని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌లో మోదీ మాట్లాడుతూ.. యువత, స్టార్టప్ కంపెనీలు ఈ కార్యక్రమంలో చేరాలని ఆహ్వానించారు. ఈ విధానం ద్వారా కాలుష్యం కలిగించే వాహనాలను నెమ్మదిగా తగ్గిస్తామని చెప్పారు. దీని వల్ల పర్యావరణానికి హితం జరుగుతుందని తెలిపారు. 






మనమంతా 75వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామని... తర్వాతి 25 ఏళ్లు దేశానికి చాలా ముఖ్యమైనవని మోదీ అన్నారు. ఈ పాతికేళ్లలో మన పని విధానంలో, జీవితంలో, వ్యాపారాలలో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని సుస్థిరంగా, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం మనమంతా వాతావరణ మార్పుల వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కొంటున్నామని.. వీటిని అధిగమించాలంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.






సహజ వనరులను మనం సృష్టించలేమని.. కానీ కాపాడుకోగలం అని అన్నారు. ఈ కారణంగానే డీప్ ఓషన్ మిషన్ (Deep Ocean Mission), సర్క్యులర్ ఎకానమీ (Circular Economy) వంటి ప్రాజెక్టులను భారత్ ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. 






కాగా వెహికిల్ స్క్రాపేజ్ పాల‌సీ ప్ర‌కారం 15 ఏళ్లకు పైబ‌డిన వాణిజ్య వాహ‌నాలు, 20 ఏళ్లు పైబ‌డిన ప్యాసింజ‌ర్ వాహ‌నాల‌ను పనికిరానివిగా భావించాలి. వీటిని త‌ప్ప‌నిస‌రిగా స్క్రాప్ వేయాలి. అలా చేయ‌కుండా వాటిని ఉపయోగిస్తే.. ప్రభుత్వం భారీ జ‌రిమానా విధిస్తుంది.