పాము కాటేస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లికి చికిత్స పొందాలి. అంతేగానీ.. దానిపై రివేంజ్ తీర్చుకోకూడదు. ఆలస్యం చేస్తే దాని విషం శరీరమంతా పాకి ప్రాణాలు తీస్తుంది. ఇటీవల బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి అదే చేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఒడిశాకు చెందిన మరో వ్యక్తి కూడా పాముపై రివేంజ్ తీర్చుకున్నాడు. తన కాటేసిన పామును ఏకంగా కొరికి కొరికి చంపేశాడు. 


జాప్‌పూర్ జిల్లా గంభరిపటియా గ్రామానికి చెందిన కిశోర్ బద్రా బుధవారం రాత్రి పొలం పనులు ముంగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అతడి కాలుపై ఓ పాము కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన కిశోర్ ఆ పామును పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఆ తర్వాత చచ్చిన పామును చేత్తో పట్టుకుని గ్రామానికి వెళ్లాడు. తన భార్యకు జరిగిన విషయాన్ని చెప్పాడు. 


ఆ తర్వాత ఆ పామును తన స్నేహితులకు చూపించాడు. దీంతో అతడు పామును కొరిక చంపేశాడనే వార్త ఊరంతా పాకింది. అయితే, పాము కరిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందాలని స్థానికులు సలహా ఇచ్చినా కిశోర్ పట్టించుకోలేదు. పాము కాటుకు సాంప్రదాయ చికిత్సను తీసుకున్నాడు. లక్కీగా కిశోర్ ప్రాణాలతోనే ఉన్నాడు. పాము కాటు అతడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. 


ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంటే కాలును ఏదో కరిచినట్లు అనిపించింది. టార్చ్‌లైట్ వేసి చూస్తే.. అది కట్ల పాము. దాని మీద పగ తీర్చుకోవాలనే ఆగ్రహంతో దాన్ని చేత్తో పట్టుకుని కొరికి కొరికి చంపేశాను. ఆ తర్వాత పాము కాటుకు సాంప్రదాయ చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది’’ అని సమాధానం ఇచ్చాడు. 


పాము కాటు చాలా ప్రమాదకరం: కిశోర్‌లా మీరు పాము కాటేస్తే అజాగ్రత్తగా ఉండకూడదు. బీహార్‌లోని నలంద జిల్లా చాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదోదేహ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రమా మహతో మద్యం తాగి ఇంటి ముందు కూర్చున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పాము పిల్ల రమాను కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రమా దాన్ని తోక పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని కొరుకుతూ నమిలేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ పాము ముఖం మీద అనేకసార్లు కాటేసింది. దీంతో రమా పామును తీసుకెళ్లి ఓ చెట్టు కింద వదిలేశాడు. 


కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. అది పిల్ల పామమని, అది కాటేస్తే ఏం కాదని చెప్పి.. నేరుగా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయితే, సోమవారం ఉదయానికి రమా చనిపోయి కనిపించాడు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు ఓ వ్యక్తి బతికున్న పామును నమిలి తినేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నూడిల్స్ తిన్నట్లుగా తింటుండడంతో నెటిజన్లు ఆ వీడియో చూసి అవ్వక్కయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీ ప్రాంతంలో జరిగి ఉండవచ్చని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ సొసైటీ అనుమానం వ్యక్తం చేసింది. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!