తెలంగాణలో శుక్రవారం (ఆగస్టు 13) నాడు కొన్ని జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలే కురుస్తాయని చెప్పారు. కానీ, ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. దాని ప్రభావంతో ఆగస్టు 16 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఆ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోనూ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణశాఖ అధికారి వివరించారు.
ఆగస్టు 12 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 13న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఏపీలో ఈ నెల 15 తర్వాత పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుందని, అది బలపడి 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
కోస్తా, రాయలసీమల్లో గత నెల చివరి వారం నుంచి వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కోస్తాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు వారాలుగా సరైన వర్షాలు కురవడం లేదు. దీనికితోడు పడమర, వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడం, బంగాళాఖాతంలో అల్పపీడనాల జాడ లేకపోవడంతో కోస్తాలో వాతావరణం వేసవి తరహాలో ఉంటోంది.
రెండ్రోజుల్లో వానలకు అవకాశం..
బిహార్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం.. ఉత్తర-దక్షిణ ద్రోణి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తరకోస్తాంధ్ర వరకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.