న్యాయమూర్తులు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఉండాలి కూడా. కానీ భావోద్వేగ పరిస్థితుల్లో  ఒక్కోసారి తమను తాము నియంత్రించుకోలేరు. విధి నిర్వహణలో తమను తాము కంట్రోల్‌లో ఉంచుకోగలరు కానీ వ్యక్తిగత భావోద్వేగాల విషయంలో మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రోహింగ్టన్ ఫాలీ నారిమన్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన  ఫేర్‌వెల్ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేకానికి గురయ్యారు.   చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ జడ్జి ఆయనే. తన పదవీ కాలంలో జస్టిస్‌ నారీమన్‌ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించడంలో భాగస్వామి అయ్యారు. తన పదవీకాలం చివరి రోజు  సీజేఐ ఎన్వీ రమణతో కలిసి   కోర్టు హాల్‌ నంబర్‌`1లో కూర్చున్నారు. రిటైర్‌ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది. 


జస్టిస్‌ నారీమన్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో ఎన్‌వి రమణ మరింత  భావోద్వేగానికి గురయ్యారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయన కూడా ఒక మూలస్తంభం అని కొనియాడారు. జస్టిస్ నారిమన్  పదవీ విరమణ చేయడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.   జస్టిస్‌ నారీమన్‌ ఎప్పుడూ సత్యం వైపే నిలబడ్డారని అన్నారు. తన కెరీర్లో మొత్తం 13,565 కేసులను వాదించారని గుర్తు చేశారు. నారీమన్‌ జ్ఞానాన్ని, మెధస్సును న్యాయవ్యస్థ  కోల్పోతుందన్నారు.  ఈ క్షణం కొంత ఉద్విగ్నంగా ఉందని, నా ఆలోచనల్ని వ్యక్తపరచడం ఇబ్బందిగా ఉందని సీజేఐ రమణ అన్నారు. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నారిమన్ చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను రద్దు చేసింది జస్టిస్‌ నారీమన్‌ ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కీలక తీర్పులు ఇచ్చింది కూడా జస్టిస్ నారిమనే.  కస్టడీ మరణాల విషయంలో పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు అమర్చాలని ఆదేశించారు. తన చివరి తీర్పులో రాజకీయ నేరచరితులకు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అందుకే న్యాయవ్యవస్థను సింహంలా కాపాడిన జస్టిస్‌ నారీమన్‌ను కోల్పోతున్నామని సీజే రమణ తన ప్రసంగంలో భావోద్వేగానికి గురయ్యారు. 


 జస్టిస్‌ నారీమన్‌ హార్వర్డ్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు. 35 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్‌ కుమారుడే జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌. 37 ఏళ్ల వయసులోనే ఆయనను సీనియర్‌ న్యాయవాదిగా సుప్రీంకోర్టు గుర్తించింది. 2011లో సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఆయన నియమితులయ్యారు. భారత చరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కింది. ఆయన రిటైర్మెంట్‌తో  సీజేఐ ఎన్వీ రమణ చెప్పినట్లుగా  భారత న్యాయ వ్యవస్థ ఓ మూలస్తంభాన్ని కోల్పోయింది.. కానీ ఆయన వేసిన పునాది మాత్రం గట్టిగానే ఉంటుంది.