Budget 2022 Telugu, Union Budget 2022, Budget facts: కేంద్ర బడ్జెట్‌కు వేళైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా జరిగే తంతే అయినా అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన సంప్రదాయాలు తెరపైకి వస్తుంటాయి. కొన్ని పోతుంటాయి. ఒకప్పుడు ఆర్థిక మంత్రులంతా బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేసుల్లో తెచ్చేవారు. నిర్మలమ్మ దానిని మార్చేసింది. ఎర్ర రంగు సంచీలో తీసుకొచ్చింది. ఆ తర్వాత కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇలా ఆసక్తికర సంగతులు మీ కోసం..!
1947: తొలి కేంద్ర బడ్జెట్
మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పాలన అంతమైన మూడు నెలలకే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
తొలి యునైటెడ్ ఇండియా బడ్జెట్
చిన్న చిన్న రాజ్యాలు కూడా భారత్‌లో కలిసిపోయాయి. దాంతో 1949-50లో ఆర్థిక మంత్రి జాన్ మతై మొట్టమొదటి యునైటెడ్ ఇండియా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఎక్కువ సార్లు ప్రవేశపెట్టింది
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ 1959-1969 మధ్య రికార్డు స్థాయిలో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మొదటి మహిళ
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఇందిరా గాంధీ. ప్రధానమంత్రిగా ఉంటూనే 1970లో స్వల్పకాలం అదనంగా ఆర్థిక బాధ్యతలు చేపట్టారు.
తొలిసారి హిందీలో
బడ్జెట్‌ను 1955 వరకు ఇంగ్లిష్‌లోనే ప్రింట్ చేసేవారు. ఆ తర్వాత నుంచి హిందీ, ఇంగ్లిష్‌లో ముద్రిస్తున్నారు.
బడ్జెట్ ప్రింటింగ్
మొదట్లో బడ్జెట్ పత్రాలు రాష్ట్రపతి భవన్‌లోనే ముద్రించేవారు. 1950లో కొన్ని పత్రాలు లీకవ్వడంతో ప్రింటింగ్‌ను మింటో రోడ్‌కు మార్చారు. 1980లో నార్త్‌బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు.
రైల్వే బడ్జెట్ విలీనం
సాధారణంగా రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెట్టడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2017లో దీనిని మార్చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే పద్దును ప్రధాన బడ్జెట్‌లో కలిపేసింది.
సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020లో సుదీర్ఘంగా బడ్జెట్ ఉపన్యాసం ఇచ్చారు. దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు. ఇదో రికార్డు.
బడ్జెట్ వేళల్లో మార్పు
మొదట్లో బ్రిటిష్ సంప్రదాయాన్నే కాంగ్రెస్ అనుసరించింది. సాయంత్రం 5 గంటలకు బ్రిటన్‌లో ఉదయం అవుతున్నప్పుడు చదివేవారు. 1999లో ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ దీనిని భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మార్చేశారు.
బ్రీఫ్‌కేస్ బదులు ఎర్రసంచీ
సాధారణంగా ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేసుల్లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. 2020లో నిర్మలా సీతారామన్ దానిని మార్చేశారు. మూడు సింహాలు, అశోక చక్రం ముద్రించిన ఎర్ర సంచీలో తీసుకొచ్చారు. ఫ్రెంచ్ భాషలోని బజెట్టీ నుంచి బడ్జెట్ పదం వచ్చింది. దానర్థం తోలు బ్రీఫ్‌కేస్.
కాగిత రహితం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020లో కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టాబ్లెట్‌లో చూస్తూ ప్రసంగించారు. ఇదే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్, అస్సాం 2019లోనే ఆరంభించాయి.
తేదీల్లో మార్పు
2017 ముందు వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ఆఖరి రోజున ప్రవేశపెట్టేవారు. వలసవాద పద్ధతినే అప్పటికీ అనుసరించారు. దివంగత అరుణ్‌జైట్లీ దీనిని మార్చారు. ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు.
Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!
Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?