Twitter Fires 30 Percent Of Talent Acquisition Team Employees : మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌ (Twitter) ఉద్యోగులకు షాకిచ్చింది! టాలెంట్‌ అక్విజిషన్‌ టీమ్‌ నుంచి 30 శాతం మందిని తొలగించింది. ఎంత మందిని తీసేశామో సంఖ్యాపరంగా చెప్పలేదు. ఎలన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో కంపెనీని కొనుగోలు చేస్తారన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.


ఉద్యోగులను తొలగించిన మాట వాస్తవమేనని ట్విటర్‌ అధికార ప్రతినిధి ఒకరు టెక్‌ క్రంచ్‌కు ధ్రువీకరించారు. ప్రస్తుత చర్య వల్ల ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడిందో మాత్రం వారు వెల్లడించలేదు. తొలగించిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీ అందుతుందనుంది. మిగిలిన రిక్రూట్‌మెంట్‌ స్టాఫ్‌ బాధ్యతలను పూర్తిగా మార్చనున్నారు.


ఇంతకు ముందే చాలా విభాగాల్లో ఉద్యోగుల ఎంపికను ట్విటర్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆడియో స్పేస్‌, కమ్యూనిటీస్‌, న్యూస్‌ లెటర్స్‌ ఉద్యోగులను గత నెల్లోనే వేరే విభాగాల్లోకి మార్చింది. ప్రజల సంభాషణపై సానుకూల ప్రభావం చూపించే విభాగాలకు వారిని తరలించారు.


Also Read: గుడ్‌న్యూస్‌! ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి!


Also Read: వాహన బీమా రూల్స్‌ ఛేంజ్‌! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!


మే నెలలో కన్జూమర్‌ ప్రొడక్ట్‌ లీడర్‌ కేవాన్‌ బెక్‌పోర్‌, రెవెన్యూ ప్రొడక్ట్‌ హెడ్‌ బ్రూస్‌ ఫాల్క్‌ను ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ తొలగించారు. ఉద్యోగ నియామకాలను ఆపేస్తున్నామని, చాలా విభాగాల్లో ఖర్చు తగ్గిస్తున్నామని అప్పుడే చెప్పారు. కీలక విభాగాల్లో అవసరమైతే సమీక్షించుకొని ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటామని వెల్లడించారు.


'కంపెనీలో కొన్ని విభాగాల్లోనే ఉద్యోగులను తొలగిస్తున్నాం. అవసరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకొనేందుకు నాయకులు తమ కంపెనీల్లో మార్పులు చేస్తూనే ఉంటారు' అని అగర్వాల్‌ ఉద్యోగులకు పంపించిన మెమోలో పేర్కొన్నారు.


'ఎలాగూ తీసుకుంటారు కాబట్టి సీఈవో ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. డీల్‌ క్లోజ్‌ అవుతుందన్న అంచనాలు నాకున్నాయి. అందుకే అన్ని రకాల పరిస్థితులకు మనం సిద్ధంగా ఉండాలి. ట్విటర్‌కు ఏది సరైందో అదే చేయాలి' అని ఆయన వెల్లడించారు.


Also Read: ఏడాదిలో లక్షకు రూ.13 లక్షల ప్రాఫిట్‌! 800% ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్‌