Twitter, Elon Musk:


ఎలన్‌ మస్క్‌ ఏ ముహూర్తాన ట్విటర్‌ కొనుగోలు చేశాడో తెలీదు గానీ కంపెనీ నిత్యం వార్తల్లోనే ఉంటోంది! కంపెనీని స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ను తొలగించాడు. నష్టాలను తగ్గించేందుకు చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు. ప్రస్తుతం 50 శాతం మందే పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన పారిశుద్ధ్య కార్మికులనూ తీసేయడంతో ఇప్పుడు బాత్‌రూమ్‌లు కంపు కొడుతున్నాయట!


ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం లేదు. దాంతో బాత్‌రూమ్‌లు, లెట్రిన్లు శుభ్రం చేసే సిబ్బంది లేకుండా పోయారు. కనీసం పనిచేస్తున్న చోటునూ ఎవరూ శుభ్రం చేయడం లేదు. దాంతో రెస్ట్‌ రూమ్‌ల నుంచి ఆఫీస్‌ వరకు అంతా కంపు వాసన కొడుతోందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది.


'పాచిపోయిన ఆహారం, శారీరక దుర్వాసనతో ఆఫీస్‌ నిండిపోయింది. ఎందుకంటే శుభ్రం చేసేవాళ్లెవరూ లేరు. కలరా ఉండలు వేయడం లేదు. టాయిలెట్‌ పేపర్‌ను తెచ్చుకోవాలని ఉద్యోగులకు చెప్పారు. కార్యాలయ భవంతిలో నాలుగు ఫ్లోర్లు మూసేశారు. ఉద్యోగులంతా రెండు ఫ్లోర్లలోనే కిక్కిరిసిపోయారు' అని ఒకరు తెలిపారు.


అద్దె చెల్లించకపోవడంతో సియాటెల్‌ కార్యాలయంలోని ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పారు. కేవలం న్యూయార్క్‌, సాన్‌ ఫ్రాన్సిస్కోలోనే ఆఫీసులు తెరిచారు. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికుల్ని వెళ్లిపోవాలని మస్క్‌ ఆదేశించినట్టు తెలిసింది. ఖర్చులు తగ్గించాలని మిగిలిన మేనేజర్లనూ ఆదేశించాడని సమాచారం. దాంతో జీరో బేస్డ్‌ బడ్జెట్‌లో భాగంగా కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్థంగా మారినట్టు సమాచారం.