Alcohol Sales Tax:


మద్యం ప్రియులకు శుభవార్త! జనవరి 1న దుబాయ్‌ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా మద్యం విక్రయాలపై విధిస్తున్న 30 శాతం పన్నును రద్దు చేసింది. లిక్కర్‌ లైసెన్సుల ఫీజునూ తీసేసింది. అక్కడి పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించేందుకు ఇలా చేసినట్టు తెలిపింది. మద్యంపై పన్నులే అక్కడి రాయల్‌ ఫ్యామిలీకి ప్రధాన ఆదాయ వనరు కావడం గమనార్హం.




వైడర్‌ ఎమిరేట్స్‌ గ్రూప్‌నకు చెందిన మద్యం సరఫరాదారు మేరిటైమ్‌ అండ్‌ మర్కంటైల్‌ ఇంటర్నేషనల్‌ (MMI) ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. 'వందేళ్లకు పైగా మేం దుబాయ్‌లో మద్యం వ్యాపారం చేస్తున్నాం. అప్పట్నుంచి గమనిస్తే ఎమిరేట్స్‌ విధానాలు ఎంతగానో మారాయి. సమ్మిళితం, సున్నితంగా ఉన్నాయి' అని ఎంఎంఐ ప్రతినిధి టైరాన్‌ రీడ్‌ తెలిపారు. ఈ విధానాలతో దుబాయ్‌లో సురక్షితమైన మద్యం తక్కువ ధరకే లభిస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి తమ స్టోర్లలోనే మద్యం కొనుగోలు చేయాలని, వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు.


పన్నులు ఎక్కువగా ఉండటంతో దుబాయ్‌ వాసులు ఉమ్మా అల్‌ కువైన్‌ వరకు సుదీర్ఘంగా ప్రయాణించి మద్యం కొనుగోలు చేయాల్సి వచ్చేది. మున్సిపాలిటీ టాక్స్‌, లైసెన్స్‌ ఫీజు పాక్షికంగా రద్దైనట్టు ఎమిరైట్స్‌లో అత్యంత ఎక్కువ మద్యం విక్రయించే రెండో సంస్థ ఆఫ్రికన్‌ అండ్‌ ఈస్ట్రన్‌ వెల్లడించింది. దుబాయ్‌ ఆర్థిక వ్యవస్థలో మద్యం అమ్మకాలే కీలకంగా ఉన్నాయి. కతార్‌లో మద్యం లేకపోవడంతో ఫుట్‌బాల్‌ ప్రేక్షకులు దుబాయ్‌ వరకు వచ్చి సేవించడం గమనార్హం.