US Tariffs Policy Effect On India: తాను అధికారంలోకి రాగానే ప్రతీకార సుంకాల విధానాన్ని (Reciprocal Tariff Policy) అమలు చేస్తానని అధ్యక్ష ఎన్నికల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్నంత పనీ చేశారు. "రెసిప్రొకల్ టారిఫ్" విధానాన్ని ప్రకటించి ఏప్రిల్ 02, 2025 నుంచి అనేక దేశాలపై అమలు చేశారు. ఈ విధానం కింద, ఇతర దేశాలు అమెరికన్ వస్తువులపై విధించే సుంకాలను అమెరికా కూడా ఇతర దేశాల ఉత్పత్తులపై విధిస్తుంది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాపార ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దీనివల్ల అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతాయి. అయితే, ఈ పరిస్థితి భారతదేశానికి కాస్త కష్టం - కాస్త ఇష్టం రెండింటినీ తెచ్చి పెట్టింది. అంటే, ప్రమాదంలోనూ అవకాశాలను వెతుక్కునే ఛాన్స్ ఉంది. అయితే, మొత్తం ఆర్థిక వ్యవస్థను కాకుండా ఒక్కో కుటుంబం ప్రాతిపదికన పరిశీలిస్తే, ట్రంప్ సుంకాల విధానం కారణంగా భారతీయ కుటుంబాలు ప్రతి సంవత్సరం కొన్ని వేల రూపాయల నష్టాన్ని చవిచూడవచ్చు.
భారతీయ కుటుంబాలకు ఎంత నష్టం?
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సుంకాల ప్రభావం పరిమితంగా ఉంటుందని భావిస్తున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, ట్రంప్ సుంకాల బాంబు భారతదేశ GDPని కేవలం 0.19 శాతం తగ్గించగలదు. ఇది, సంవత్సరానికి ప్రతి భారతీయ కుటుంబానికి రూ. 2,396 ఆదాయం తగ్గడంతో సమానం. దీనికి కారణం భారతదేశానికి బలమైన దేశీయ డిమాండ్ & ప్రపంచ ఎగుమతుల్లో పరిమిత వాటా (2.4 శాతం).
అమెరికాకు భారతదేశం ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి. 2025 ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్యకాలంలో భారతదేశం USకు 395.63 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. US సుంకాల పెంపు వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ & వ్యవసాయ ఉత్పత్తులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అయితే, ఇది కూడా ఒకరకమైన అవకాశమే. దీనిని ఇంకా సింపుల్‌గా అర్థం చేసుకుందాం - భారతదేశం ప్రతి సంవత్సరం 8 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులను & 5 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు పంపుతుంది. కానీ.. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై భారత్ కంటే అధిక సుంకాల కారణంగా, వాటితో పోలిస్తే భారతీయ ఉత్పత్తులు చవకగా మారతాయి & ఎగుమతులకు కొత్త తలుపులు తెరుస్తాయి.
మంచి స్థితిలో భారతదేశం
ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ ప్రకారం, అన్ని దేశాలపై 10 శాతం బేస్ టారిఫ్ అమల్లోకి వచ్చింది. దీనికి భారతదేశంపై 26 శాతం అదనపు సుంకం యాడ్ అవుతుంది. అదే సమయంలో, చైనాపై 34 శాతం, వియత్నాంపై 46 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం & యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం అదనపు సుంకాలు వర్తిస్తాయి. అంటే.. భారతదేశం తన పోటీ దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంటుంది. అందువల్లే భారతీయ వస్తువులు ఇప్పటికీ అమెరికన్ మార్కెట్లో చవకగా లభిస్తాయి.
అమెరికాలో స్టాగ్‌ఫ్లేషన్!
ట్రంప్ టారిఫ్‌లు అమెరికాలో అధిక ద్రవ్యోల్బణానికి దారి తీసే & ఆర్థిక వృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనిని 'స్తబ్దత' లేదా 'స్టాగ్‌ఫ్లేషన్' (Stagflation) అని పిలుస్తారు. చైనా చేసినట్లుగానే ఇతర దేశాలు కూడా ప్రతీకార సుంకాలు విధిస్తే ప్రపంచ వాణిజ్య యుద్ధం సంభవించవచ్చు. అలాంటి పరిస్థితిలో కొత్త వ్యూహాలు రూపొందించడానికి & కొత్త మార్కెట్లను అన్వేషించడానికి భారతదేశానికి ఇది సరైన సమయం.
దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు, డంపింగ్ డ్యూటీని ఆపడానికి & అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశం.. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాలతో సమర్థవంతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలిగితే భారతీయ వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల వంటి రంగాలు పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు.