Mumbai Real Estate News: బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ‍‌(Amitabh Bachchan) పొరుగున ఉండాలనుకుంటున్నారా?, బచ్చన్‌ సాబ్‌ ఇంటి పక్కనే మా ఇల్లు అని ప్రపంచం మొత్తానికి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నారా?, మీ సమాధానం అవును అయితే లాక్‌ పెట్టేయమంటారా?, 


బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ నివాసం ఉండే భవనం పేరు జల్సా (Jalsa). ముంబైలోని మహా ఖరీదైన ప్రాంతమైన జుహులో ఈ ఇల్లు ఉంది. బిగ్‌ బి ఇంటి పక్కనే ఉండే గొప్ప అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశం మీకు మాత్రమే సొంతం కావాలంటే, దాని కోసం కొంత డబ్బును ఖర్చు చేయాలి. ఆ తర్వాత, బచ్చన్ 'జల్సా' పక్కనే ఉన్న లగ్జరీ బంగ్లా మీదవుతుంది.


జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ బచ్చన్ ఇంటి పక్కనే ఉన్న లగ్జరీ బంగ్లాను వేలం (Auction) వేస్తున్నారు. ఈ నెల 27న వేలంపాట ఉంటుంది. వేలం వేస్తున్న ఆస్తిలో ఇండోర్ & ఔట్‌డోర్ స్పేస్ రెండూ ఉంటాయి. మొత్తం ఆస్తి 3 వేల చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాపర్టీ వేలంపాట ప్రారంభ ధరను రూ.25 కోట్లుగా నిర్ణయించారు.


బంగ్లాపై బ్యాంకు రుణం బకాయి
నేషనల్‌ మీడియాలో ఉన్న రిపోర్ట్స్‌ ప్రకారం, జల్సా పరిసరాల్లో ఉన్న ఈ బంగ్లాను SARFAESI చట్టం (సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్) కింద వేలం వేస్తున్నారు. పాత యజమానులు ఈ బంగ్లాపై డ్యూయిష్‌ బ్యాంక్‌ (Deutsche Bank) నుంచి అప్పు తీసుకున్నారు. సెవెన్ స్టార్ శాటిలైట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో సహా రుణగ్రహీతలు, సహ రుణగ్రహీతలు కలిపి రూ. 12.89 కోట్ల బకాయి పడ్డారు. 


వేలంపాట కోసం డిపాజిట్‌ మొత్తం రూ.2.5 కోట్లు
లోన్‌ క్లియర్ చేయాలని బ్యాంక్ పదేపదే కోరింది. బ్యాంకు నుంచి ఎన్ని విన్నపాలు వచ్చినా, ఆ బడాబాబులు చలించలేదు. చివరకు, ఆ ఆస్తిని డ్యూయిష్‌ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది, వేలం వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ఆ బంగ్లాను ఈ నెల 27న వేలానికి పెడుతున్నారు. ఒకవేళ మీరు కూడా వేలంలో పాల్గొనాలని భావిస్తే, ముందుగా 2.5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌కు పొరుగున ఉండి, 'జల్సా' పక్కనే ఉన్న బంగ్లాలో జల్సా చేసే ఛాన్స్‌ పొందాలంటే, మీరు వేలంపాటలో పాల్గొనాలి. దీనికోసం, ఇప్పటికిప్పుడు రూ. 2.5 కోట్లు మీ దగ్గర ఉండాలి. ఆ డబ్బుతో ముంబై బయలు దేరాలి, బ్యాంక్‌ వద్ద డిపాజిట్ చేయాలి. వేలంపాట కోసం నిర్ణయించిన బేస్ ధర రూ.25 కోట్లు కాబట్టి, ఈ రేటు నుంచే పాట ప్రారంభమవుతుంది. వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు, తమ ఆసక్తి/ ఆర్థిక బలాన్ని బట్టి రేటు పెంచేస్తారు. ఆ బంగ్లా మీది కావాలంటే, వేలంపాటలో పాల్గొనే బడాబాబులు అందరి కంటే మీరే ఎక్కువ రేటుకు పాడాలి. దీనికి తగ్గట్లుగా ముందే ప్రిపేర్‌ అయి వెళితే బాగుంటుంది.


మరో ఆసక్తికర కథనం: 4 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం, ఆహార ధరలు మాత్రం తగ్గలా!