Wholesale Inflation Data For February 2024: రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందన్న చల్లటి వార్త తర్వాత, ఇప్పుడు, టోకు ద్రవ్యోల్బణం (WPI inflation) వేడి నుంచి కూడా ఉపశమనం లభించింది. 2024 జనవరిలో 0.27 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.20 శాతానికి తగ్గింది. గత నాలుగు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి. అయితే, ఆహార పదార్థాల ధర వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. టోకు ద్రవ్యోల్బణం రేటుకు సంబంధించిన డేటాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.


WPI ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రతికూలంగా నమోదైంది, 203 నవంబర్‌లో 0.26 శాతం వద్ద సానుకూలంగా మారింది.


ఆహార పదార్థాలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్, యంత్రాలు & పరికరాలు, మోటారు వాహనాలు, ట్రాలర్లు, సెమీ ట్రాలర్ల ధరలు తగ్గడం వల్ల 2024 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉంది, జనవరిలోని 6.85 నుంచి ఇది కొద్దిగా పెరిగింది. ప్రైమరీ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 4.49 శాతంగా ఉంది, దీనికి ముందు నెలలో 3.84 శాతంగా ఉంది. పెట్రోలియం, సహజవాయువు టోకు ద్రవ్యోల్బణం 8.24 శాతంగా నమోదైంది. ఇంధనం & విద్యుత్‌ ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో -1.59 శాతంగా ఉంది, జనవరిలో - 0.51 శాతంగా ఉంది. తయారైన ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు - 1.27 శాతంగా లెక్క తేలింది. అంతకుముందు మార్చి 12 న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు డేటా విడుదల చేయబడింది, దీనిలో ద్రవ్యోల్బణం జనవరిలో 5.10 శాతంగా ఉన్న 5.09 శాతానికి తగ్గింది.
  
ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల
రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మాదిరిగానే, టోకు ద్రవ్యోల్బణం డేటాలో కూడా ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదల కనిపించింది. 2024 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణంలో ఫుడ్‌ ఇండెక్స్‌ 4.09 శాతానికి చేరుకుంది, ఇది జనవరిలో 3.79 శాతంగా ఉంది. ఆహార పదార్థాల్లో... కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 19.78 శాతంగా ఉంది, ఇది జనవరిలో 19.71 శాతంగా & 2023 ఫిబ్రవరిలో ప్రతికూలంగా -21.58 శాతంగా ఉంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 2.59 శాతంగా ఉంది, ఇప్పుడు 18.48 శాతానికి చేరింది, జనవరిలో 16.06 శాతం నుంచి పెరిగింది. బియ్యం ద్రవ్యోల్బణం 2024 ఫిబ్రవరిలో 10.25 శాతంగా ఉంది, 2023 ఫిబ్రవరిలో 8.60 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో - 40.22 శాతంగా ఉంటే, ఇప్పుడు 29.22 శాతంగా ఉంది. పాలు, పండ్ల ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరితో పోలిస్తే 2024 ఫిబ్రవరిలో తగ్గింది.


శాంతించిన చిల్లర ద్రవ్యోల్బణం
ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation Data For February 2024) 5.09 శాతంగా నమోదైంది, ఇది 4 నెలల కనిష్ట స్థాయి. అంతకుముందు, జనవరి నెలలో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా ఉంది. ఏడాది క్రితం, 2023 ఫిబ్రవరిలో 6.44 శాతంగా నమోదైంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69 శాతంగా ఉంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆహార పదార్థాల ధరలు మాత్రం తగ్గలేదు. రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌లో ఆహార పదార్థాల ధరల సూచీ (Food Inflation Rate in February 2024) జనవరిలోని 8.30 శాతం నుంచి ఫిబ్రవరిలో 8.66 శాతానికి చేరుకుంది. 2023 ఫిబ్రవరిలో ఇది 5.95 శాతంగా ఉంది. 


మరో ఆసక్తికర కథనం: ముఖేష్ అంబానీ కొత్త డీల్‌, వయాకామ్‌లో పారామౌంట్ వాటాపై కన్ను