Millionaires and Billionaires Number In India Is Growing: ఏ సంవత్సరంలో చూసినా, భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నివేదిక (Knight Frank report) ప్రకారం, భారతదేశంలో అధిక సంపద కలిగిన వ్యక్తుల (High Net Worth Individuals - HNWIs) సంఖ్య, అంటే కనీసం 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 2024లో 6 శాతం పెరిగి 85,698కి చేరుకుంది. ఈ నంబర్ 2023లో 80,686గా ఉంది.
కోటీశ్వరుల సంఖ్య మరింత పెరుగుతుంది
2028 నాటికి భారతదేశంలో కోటీశ్వరులు/మిలియనీర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు) సంఖ్య 93,753కి పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి రేటు, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు & లగ్జరీ మార్కెట్ విస్తరణను ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుంది.
పెరిగిన బిలియనీర్ల సంఖ్య
మిలియనీర్లతో పాటు, బిలియనీర్ల (కుబేరులు అని చెప్పుకోవచ్చు) సంఖ్య కూడా పెరిగింది. బిలియన్ డాలర్ల (కనీసం 8,700 కోట్ల రూపాయలు) సంపద కలిగిన వ్యక్తిని బిలియనీర్ అని పిలుస్తారు. 2024లో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 191కి చేరుకుందని అంచనా వేసింది. 2019లో ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. గత సంవత్సరం 26 మంది సంపన్నులు మిలియనీర్ నుంచి బిలియనీర్ స్థాయికి చేరారు.
భారతీయ కుబేరుల మొత్తం సంపద విలువ
భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 950 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 79 లక్షల కోట్లు) అని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంఖ్య పరంగా, భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో (5.7 ట్రిలియన్ డాలర్లు), చైనా రెండో స్థానంలో (1.34 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: టెస్లా కార్లను ఇండియాలోనే కొనొచ్చు, ఇంపోర్ట్ అక్కర్లేదు - ఫస్ట్ షోరూమ్ ఓపెనింగ్!
భారత్‌లో ధనవంతుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
భారతదేశంలో పెరుగుతున్న ధనవంతుల సంఖ్య దేశ ఆర్థిక బలాన్ని, దీర్ఘకాలిక వృద్ధిని చూపిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ చెబుతున్నారు. భారతదేశంలో వ్యవస్థాపకత, ప్రపంచ ఏకీకరణ, కొత్త పరిశ్రమలకు అవకాశం దీనికి దోహదపడుతున్నాయని అన్నారు. భారతదేశంలోని ధనవంతుల పెట్టుబడి ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయని శిశిర్ బైజల్ వెల్లడించారు. రియల్ ఎస్టేట్ నుంచి గ్లోబల్ ఈక్విటీల వరకు వివిధ రకాల ఆస్తి తరగతుల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు.
ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యక్తుల ఆస్తుల విలువ అనేక దేశాల GDP స్థాయులను కూడా దాటాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో, అత్యధికులు అమెరికాలో ఉండగా, భారతదేశం మూడో స్థానంలో ఉంది.
మరో ఆసక్తికర కథనం: దాదాపు రూ.5000 తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ