Virat Kohli Vs Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సడన్గా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం భారత్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం తాను వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లుగా స్టీవ్ స్మిత్ ప్రకటన చేశాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే స్మిత్ రిటైర్మెంట్ ప్రకటన విషయం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ముందుగానే తెలిసినట్లు నెటిజన్లు చర్చిస్తున్నారు. మంగళవారం మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల టీం ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భంలో స్మిత్ కు కోహ్లీ ఎదురయ్యాడు. ఆ సమయంలో స్మిత్ ను ఏదో ప్రశ్నించగా దానికి నిరాశపూరితంగా అవును అన్నట్లుగా తలూపాడు. ఆ తర్వాత అతని భుజం తట్టి, కోహ్లీ ఏదో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తాజాగా నెటిజెన్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ స్మిత్ రిటర్మెంట్ విషయం కోహ్లీకి ముందుగానే తెలుసు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్యాబులస్ ఫోర్లో సభ్యులైన స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్,జో రూట్ మధ్య మంచి స్నేహం ఉంది. ముఖ్యంగా అటు విలియమ్సన్ తో ఇటు స్మిత్ తోనూ కోహ్లీ స్నేహపూరిత సంబంధాలు నెరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ విషయాన్ని ముందుగానే స్మిత్ ..కోహ్లీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ లైకులు, షేర్లతో సందడి చేస్తున్నారు.
ఇకపై టెస్టుల్లోనే ఆడనున్న స్మిత్ ...
వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆస్ట్రేలియా జట్టుకు కేవలం టెస్ట్ మ్యాచ్ ల్లోనే స్మిత్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. చాలాకాలం కిందటే టి20 జట్టు నుంచి ఉద్వాసనకి గురైన స్మిత్ కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో తనను కేవలం టెస్టు జెర్సీలోనే అభిమానులు చూడమన్నారు. అలాగే వివిధ రకాల క్రికెట్ లీగ్లలో కూడా తను ఆడనున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రస్థానం ముగియడంతో తనను తిరిగి అంతర్జాతీయ మ్యాచుల్లో వచ్చే జూన్ లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో చూడవచ్చు. ఇంగ్లాండ్లోని క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం స్టీవ్ స్మిత్ సిద్ధమవుతున్నాడు. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే జూన్లో కూడా విజేతగా నిలిచి వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవాలని ఆసీస్ భావిస్తుంది.
రెండుసార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో….
తన రిటైర్మెంట్ ప్రకటనపై స్మిత్ మాట్లాడుతూ ఇంత కాలం క్రికెట్ ను ఆస్వాదిస్తూ గడిపానని పేర్కొన్నాడు. రెండుసార్లు వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో సభ్యునిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 2027 వన్డే ప్రపంచ కప్ కు జట్టును సిద్ధం చేస్తున్న తరుణంలో తాను వైదొలగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటినుంచి సరైన ఆటగాళ్ల కోసం అన్వేషణ సాగించాలని సూచించాడు. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉందని ఇకపై ఇతర ఫార్మాట్లలో తాను సత్తా చాటుతానని పేర్కొన్నాడు. మరోవైపు స్మిత్ రిటైర్మెంట్ పై క్రికెట్ ఆస్ట్రేలియా తో పాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా సందేశాలు వెలువరిస్తున్నారు. కమిట్మెంట్ ఉన్న క్రికెటర్ స్మిత్ అని, ఆస్ట్రేలియాని కెప్టెన్సీలో అద్భుతంగా నడిపించాడని కొనియాడుతున్నారు.
Read Also:స్టీవ్ స్మిత్ షాకింగ్ డెసిషన్.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్