Tesla Going To Open First Showroom In BKC Mumbai: ప్రపంచంలోని ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా కార్లది హై రేంజ్, హై క్వాలిటీ, హై ఎక్స్‌పీరియన్స్. మన దేశంలోనూ టెస్లా కార్ ప్రియులు బోలెడు మంది ఉన్నారు, కొంతమంది దగ్గర ఆ కంపెనీ కార్లు ఉన్నాయి. అయితే, అవన్నీ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇకపై టెస్లా కార్‌లను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే కొనవచ్చు. తాజా అప్‌డేట్ ప్రకారం, ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని టెస్లా, భారతదేశంలో తన మొదటి షోరూమ్ ఏర్పాటును అధికారికంగా ఖరారు చేసిందని సమాచారం. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ, తన మొదటి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించడానికి లీజ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ఇండియాలో మొదటి టెస్లా షోరూమ్
ముంబైలో ఏర్పాటు చేయబోయేది ఇండియాలోనే మొట్టమొదటి టెస్లా షోరూమ్. ఇది, ముంబై విమానాశ్రయానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) బిజినెస్ & రిటైల్ హబ్‌లో ఉన్న మేకర్ మాక్సిటీ భవనంలో ఉంటుంది.
ఇటీవల, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికా పర్యటన సమయంలో, టెస్లా CEO ఎలాన్ మస్క్ మోదీతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా లీజ్ అగ్రిమెంట్ కుదరడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ పేపర్ల ప్రకారం, టెస్లా 16 ఫిబ్రవరి 2025 నుంచి ఐదు సంవత్సరాల లీజు కోసం సంతకం చేసింది. దాదాపు బాస్కెట్‌బాల్ కోర్టు పరిమాణంలో ఉన్న 4,003 చదరపు అడుగుల (372 చదరపు మీటర్లు) స్థలాన్ని అద్దెకు తీసుకుంది. మొదటి సంవత్సరానికి దాదాపు 4,46,000 డాలర్లు లేదా సుమారు 3.89 కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తుంది.
భారత్‌లో టెస్లా షోరూమ్ లొకేషన్‌లు & ప్రారంభ తేదీలు
టెస్లా, తన షోరూమ్‌ల కోసం భారత్‌లో రెండు ప్రదేశాలను ఎంపిక చేసుకుంది. ఒకటి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కాగా, రెండోది న్యూదిల్లీలోని ఏరోసిటీ (Tesla's second showroom in Delhi). ఈ ఔట్‌లెట్‌ల ప్రారంభ తేదీలు ఇంకా నిర్ణయించలేదు. అయితే, 2025 ఏప్రిల్ నుంచి టెస్లా కార్ అమ్మకాలు ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
టెస్లా చేస్తోంది ట్రంప్‌నకు ఇష్టం లేని పని
టెస్లా కంపెనీ భారత్‌లోకి రావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు ఇష్టం లేదు. అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి టెస్లా షోరూమ్‌ను భారత్‌లో ఏర్పాటు చేయడం అమెరికాకు జరుగుతున్న "అన్యాయం" అని ట్రంప్ చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై భారతదేశం విధిస్తున్న అధిక సుంకాల గురించి ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై, అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతోనూ చర్చించారు.
వాస్తవానికి, టెస్లా CEO మస్క్ కూడా భారతదేశం విధిస్తున్న అధిక దిగుమతి సుంకాలకు వ్యతిరేకం. ఎలక్ట్రిక్ కార్లపై భారత్ దాదాపు 100% ఇంపోర్ట్ టాక్స్ విధిస్తోంది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆటో మార్కెట్ అయిన ఇండియాలో, టాటా మోటార్స్ వంటి దేశీయ కంపెనీలను రక్షించేందుకే విదేశీ కార్లపై భారీ కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారని మస్క్ కూడా చాలాసార్లు చెప్పారు. మోదీ-మస్క్ సమావేశంలో టెస్లా కార్ దిగుమతులపై సుంకాల తగ్గింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే, భారత్‌లో టెస్లా షోరూమ్‌ల ఏర్పాటు దాదాపు ఖరారైంది.
మరో ఆసక్తికర కథనం: ఆ వీడియో నిజమేనా? - కస్టమర్లను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్