SBI Deepfake Video: డీప్‌ఫేక్ వీడియోల బాధ సినీతారలకే కాదు, స్టేట్ బ్యాంక్‌కు కూడా తప్పలేదు. సాధారణంగా, డీప్‌ఫేక్‌తో గారడీ చేసి సినిమా హీరోయిన్లను అసభ్యంగా చూపిస్తుంటారు కొందరు ఆన్‌లైన్ అగంతుకులు. ఈ ఉన్మాదం సినిమా ఫీల్డ్ నుంచి షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల వరకు గతంలోనే పాకింది. ఇప్పుడు, మరో టర్న్ తీసుకుని బ్యాంకింగ్ ఫీల్డ్‌కూ వ్యాపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని డీప్‌ఫేక్ వీడియోల గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు, ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
SBI టాప్ మేనేజ్‌మెంట్ కొన్ని పెట్టుబడి పథకాలు ప్రారంభిస్తున్నట్లు లేదా కొన్ని పథకాలు బెస్ట్ అని చెబుతున్నట్లు ఈ వీడియోలలో ఉంది. ఆ దృశ్యాలు నిజమైనవి కాదని, తప్పుగా చూపించారని కస్టమర్లు, సాధారణ ప్రజలకు స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంక్ లేదా బ్యాంక్ ఉన్నతాధికారులు అలాంటి మోసపూరిత పథకాలకు మద్దతు ఇవ్వడం లేదా ప్రారంభించడం చేయలేదని స్పష్టం చేసింది.
SBI, తన అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది, కస్టమర్లను డీప్‌ఫేక్ వీడియోల గురించి హెచ్చరించింది.
X పోస్ట్‌లో స్టేట్ బ్యాంక్ ఏం చెప్పింది?
"స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్‌మెంట్ కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ప్రారంభించినట్లు లేదా మద్దతు ఇస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అలాంటి వీడియోలపై కస్టమర్లు, సాధారణ ప్రజలను స్టేట్ బ్యాంక్ హెచ్చరిస్తోంది. సాంకేతిక సాధనాలను ఉపయోగించడం ద్వారా మోసపూరిత పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టమని ఆ వీడియోలు ప్రజలకు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. SBI లేదా బ్యాంక్ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా అవాస్తవిక లేదా అసాధారణంగా అధిక రాబడిని హామీ ఇచ్చే అలాంటి పెట్టుబడి పథకాలను అందించరు లేదా మద్దతు ఇవ్వరు అని మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి, సోషల్ మీడియాలో తిరుగుతున్న అయ్యే ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోలను నమ్మకుండా & వాటి బారిన పడకుండా ప్రజలను హెచ్చరిస్తున్నాం" అని స్టేట్ బ్యాంక్ తన పోస్ట్‌లో పేర్కొంది.
డీప్‌ఫేక్ వీడియోలు అంటే?
ఆధునిక సాంకేతికత రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచికి & చెడుకీ రెండిండికీ ఉపయోగించవచ్చు. డీప్‌ఫేక్ వీడియోలను అధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టిస్తారు. ఫొటోలు, గొంతుకలు, దృశ్యాలను తారుమారు చేసి అత్యంత వాస్తవంలా కనిపించే & వినిపించే పూర్తి నకిలీ వీడియోలు, ఫొటోలు, ఆడియోలను సృష్టిస్తారు. డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడం కష్టం. నిజంగానే ప్రముఖ వ్యక్తులు లేదా పెద్ద సంస్థలు ఆ దృశ్యాలలో ఉన్నారేమోనని లేదా మాట్లాడేరేమోనని సాధారణ ప్రజలు భ్రమిస్తారు, అది అబద్ధమని ఈజీగా గుర్తించలేరు. సైబర్ కేటుగాళ్లు అలాంటి డీప్‌ఫేక్ వీడియోలను మోసం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడానికి ఉపయోగించుకుంటారు. వెనకాముందు ఆలోచించకుండా కనిపించిన ప్రతి వీడియో, ఫోటోలు, ఆడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వ్యక్తులు తమకు తెలీకుండానే అలాంటి మోసాలను ప్రోత్సహిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'