Suspected Mobile Connections In India: 143 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో, 2023 డిసెంబర్‌ 31 నాటికి, టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119 కోట్లకు పెరిగింది. ఇది దేశ జనాభాలో 83 శాతానికి సమానం. ప్రస్తుతం, మన దేశంలో ఉన్న మొబైల్‌ కనెక్షన్లలో 6.80 లక్షల మొబైల్ నంబర్లు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయట. తప్పుడు పత్రాలను ఉపయోగించి వాటిని పొందినట్లు టెలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (Department of Telecommunications) సందేహం. ఇది నిజమని తేలితే ఆ నంబర్లను డీయాక్టివేట్‌ (SIM Deactivation) చేయడం ఖాయం. టెలికాం డిపార్ట్‌మెంట్, ఆ 6.80 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్‌లను రీ వెరిఫై ‍‌(Re-verification) చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌) ఆదేశించింది. 


అనుమానాస్పద మొబైల్‌ నంబర్లను ఎలా కనిపెట్టారు?
అనుమానాస్పద మొబైల్‌ నంబర్లను కనిపెట్టడానికి కృత్రిమ మేథను (AI) టెలికాం అధికార్లు ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించిన తర్వాత, దాదాపు 6.80 లక్షల మొబైల్ కనెక్షన్‌ల వ్యవహారం సక్రమంగా లేదని గుర్తించారు. తప్పుడు లేదా నకిలీ పత్రాలను ఉపయోగించి ఆ కనెక్షన్లు పొందినట్లు టెలికమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార్లు అనుమానిస్తున్నారు. 


రీ వెరిఫికేషన్‌ కోసం రెండు నెలల సమయం
అనుమానాస్పదంగా గుర్తించిన మొబైల్ నంబర్లను 60 రోజుల్లోగా రీ వెరిఫై చేయాలని అన్ని టెలికాం కంపెనీలను టెలికాం శాఖ ఆదేశించింది. "చెల్లని, ఉనికిలో లేని లేదా నకిలీ, ఫోర్జరీ చేసిన గుర్తింపు పత్రాలను (Proof of Identity), తప్పుడు చిరునామా రుజువులను (Proof of Address) KYC కోసం ఉపయోగించి దాదాపు 6.80 లక్షల మొబైల్ కనెక్షన్‌లు పొందినట్లు అనుమానిస్తున్నాం" అని టెలికాం డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: డబ్బు సంపాదనలో హైదరాబాదీలు ఫస్ట్‌, తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు 


ఎలాంటి చర్య ఉంటుంది?             
DoT (Department of Telecommunications) ఆదేశాల ప్రకారం, అనుమానాస్పదంగా గుర్తించిన మొబైల్ నంబర్‌లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మళ్లీ ధృవీకరించుకోవాలి. అంటే, ఆయా నంబర్లు ఎవరి దగ్గర ఉన్నాయో గుర్తించి, మళ్లీ ఫ్రెష్‌గా KYC (Know Your Customer) అప్‌డేషన్‌ చేయించాలి. ఈ పనిని 60 రోజుల లోపు పూర్తి చేయాలి. ఒకవేళ, ఏదైనా కనెక్షన్ రీ-వెరిఫికేషన్‌ పరీక్షలో విఫలమైతే, ఆ మొబైల్‌ నంబర్‌ను టెలికాం ప్రొవైడర్‌ డీయాక్టివేట్‌ చేస్తుంది.


ఏప్రిల్‌ నెలలో వేల కనెక్షన్లు క్లోజ్‌             
ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో, టెలికాం డిపార్ట్‌మెంట్‌ కొన్ని వేల కనెక్షన్లను క్లోజ్‌ చేసింది. ఆ నెలలో, రీ-వెరిఫికేషన్ కోసం 10,834 అనుమానాస్పద మొబైల్ నంబర్లను టెలికాం రెగ్యులేటర్‌ DoT గుర్తించింది. వాటిలో 8,272 మొబైల్ కనెక్షన్‌లు రీ-వెరిఫికేషన్ విఫలం కావడంతో వాటికి చరమగీతం పాడింది. సరిగా లేని లేదా నకిలీ లేదా ఫోర్జరీ చేసిన KYC పత్రాలను ఉపయోగించి ప్రజలు ఆ మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారని దీనివల్ల నిర్ధరణ అయింది.


మరో ఆసక్తికర కథనం: మీ సంపద పెంచే సెవెన్ వండర్స్‌- ఎక్కువ మందికి అచ్చొచ్చాయట!