Bangladesh MP Murder Case: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అన్వర్ ( Anwarul Azim Anwar) హనీ ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా తేల్చి చెప్పారు. హనీ ట్రాప్ చేసిన మహిళనీ అదుపులోకి తీసుకున్నారు. మహిళ పేరు షిలంతి రహమాన్ అని వెల్లడించారు. బంగ్లాదేశ్‌కి చెందిన షిలంతి ఈ కేసులో ప్రధాన నిందితుడైన అక్తరుజ్జమన్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ అని విచారణలో తేలింది. అంటే గర్ల్‌ఫ్రెండ్‌నే ఎరగా వేసి ఎంపీని అత్యంత దారుణంగా (Bangladesh MP Murder) చంపించాడు. కోల్‌కత్తాలోని న్యూ టౌన్‌ ఏరియాలో ఈ హత్య జరిగింది. నలుగురికి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించాడు అక్తరుజ్జమన్. ఎంపీ హత్యకు గురైనప్పుడు షిలంతి కోల్‌కత్తాలోనే ఉంది. ఆ తరవాత మే 15న హంతకుల్లో ఒకరైన అమనుల్లా అమన్‌తో కలిసి ధాకాకి వెళ్లిపోయింది. ఎంపీ అన్వరుల్‌ని బంగ్లాదేశ్ నుంచి కోల్‌కత్తా రప్పించేందుకు షిలంతితో హనీ ట్రాప్ చేయించారు. అయితే...ఈ హత్య ఎందుకు చేశారన్నది మాత్రం ఇంకా తేలలేదు. కొన్ని పేమెంట్స్ విషయంలో ఎంపీకి, అక్తరుజ్జమన్‌కి విభేదాలు తలెత్తాయని, అందుకే చంపించి ఉంటాడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ హత్య చేసేందుకు రూ.5కోట్లు సుపారీ ఇచ్చాడు ప్రధాన నిందితుడు. వెస్ట్‌ బెంగాల్ సీఐడీ వేగంగా ఈ విచారణ చేపడుతోంది. 


అత్యంత దారుణంగా హత్య..


కోల్‌కత్తాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎంపీని (Bangladesh MP Anwarul Death) అత్యంత కిరాతకంగా హతమార్చారు నిందితులు. ముందు గొంతు బిగించి ఊపిరాడకుండా చేశారు. చనిపోయిన తరవాత తోలంతా ఒలిచేశారు. ఎముకలు విరగ్గొట్టారు. బాడీ డీకంపోజ్ కాకుండా ముక్కలుగా నరికి పసుపు పూశారు. ఆ తరవాత ఆ పార్ట్స్‌ని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కొన్ని, ట్రాలీ బ్యాగ్‌లో మరి కొన్ని పెట్టి సిటీలో పలు చోట్ల పారేశారు. ఎక్కడా పోలీసులు జాడ కూడా కనిపెట్టకుండా పక్కాప్లాన్‌తో మర్డర్ చేశారు. అయితే...సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వాళ్లను గుర్తించారు. వాళ్లు ట్రాలీబ్యాగ్‌ని తీసుకొస్తున్న వీడియో కూడా అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పటికే ఈ కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే..ఈ మొత్తం కేసులో హనీట్రాప్ (Bangladesh MP Honey Trapped) చేసిన మహిళ పాత్ర ఏంటన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెతో ఎంపీకి ఎలా పరిచయం ఏర్పడింది..? ఈ హత్య ఎందుకు చేయించాల్సి వచ్చింది..? అనే కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన అన్వరుల్‌...మే 12న చికిత్స కోసం కోల్‌కత్తాకు వచ్చారు. కోల్‌కత్తాలో తన ఫ్రెండ్‌ ఇంట్లోనే ఉన్నాడు. మే 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన అన్వరుల్‌ ఆ తరవాత రాలేదు. ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. మొబైల్ కూడా స్విచాఫ్ అయింది. అప్పుడే పోలీసులు రంగంలోకి దిగి విచారించగా హత్యకు గురైనట్టు తేలింది. 


Also Read: China Taiwan Tensions: తైవాన్‌ మీదకు కుక్కల్ని ఉసిగొల్పనున్న చైనా? మిలిటరీలోకి రోబో డాగ్స్‌!