TTD Dismissed VIP Break Darshanams: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. వారికి శ్రీవారి దర్శనం వీలైనంత వేగంగా కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జూన్ 30 వరకూ వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (VIP Break Darshanam) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, వేసవి సెలవులు, విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడి, ఎన్నికలు పూర్తికావడం వంటి కారణాలతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దాదాపు 30 నుంచి 40 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


20 గంటల సమయం


మరోవైపు, శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీల మేర బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి స్వామి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గురువారం స్వామి వారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా.. 36,128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


Also Read: TTD Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆగస్ట్ నెల దర్శన కోటా టికెట్లు విడుదల