Top Engineering Colleges In Vijayawada: వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చేశాయి. మళ్లీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకాబోతోంది. అటు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సైతం మంచి కాలేజీలు(Colleges), ఇనిస్టిట్యూట్‌లు, కోర్సులపై నానా హైరానాపడున్నారు. ఏ కాలేజీలో చేరాలని...ఏ కోర్సులో చేరాలన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇంటి నుంచి రానూపోనూ అందుబాటులో ఉండటమేకాదు...బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే కోర్సులు(Courses) ఎంచుకోవాలి. ఆయా కాలేజీలు అందించే కోర్సులు, వాటికి ఉండే గుర్తింపు, క్యాంపస్ ప్లేస్‌మెంట్ వంటివి బేరీజు వేసుకుని చేరాలి. ఇప్పటికే ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థుల కోసం విజయవాడ(Vijayawada)లో అందుబాటులో ఉన్న టాప్ కాలేజీలు ఏంటో ఒకసారి చూద్దాం....
విజయవాడలో ఇంజినీరింగ్ కళాశాలలు....
చదువుల తల్లి సరస్వతీ పుట్టినిల్లుగా పేరుగాంచిన బెజవాడ...ఎడ్యూకేషనల్ హబ్‌గా ఎదిగింది. రాష్ట్రంలో టాప్ జూనియర్ కళాశాలలతోపాటు ఇంజినీరింగ్ కాలేజీలు(Engineering Colleges) ఈ పరిసర ప్రాంతాల్లో కొలువుదీరాయి. డీమ్డ్ యూనివర్సిటీలు, పేరెన్నికగన్న కళాశాలలకు కొదవే లేదు. విజయవాడకు అతి సమీపంలోనే అమరావతిలో ప్రసిద్ధిగాంచిన విట్, S.R.M. యూనివర్సిటీలతోపాటు K.L. యూనివర్సిటీ, విజ్ఞాన్(Vignan) యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు విజయవాడ నగరంలోనే ఉన్న టాప్ కళాశాలల సంగతి ఒకసారి చూద్దాం..
1.వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల(VRSEC) దీనికి AICTE, NBA గుర్తింపు ఉంది. ఈ ప్రైవేట్ అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. ఎంసెట్‌లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇంజినీరింగ్‌లో CEC, ECE, EEE, IT, సివిల్, మెకానిక్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సులను అందిస్తోంది. గతేడాది సీఈసీ కోర్స్‌కు ఎంసెట్ కటాఫ్ ర్యాంకు 3746 గా ఉంది. మెషిన్ లెర్నింగ్‌కు 4,929, డేటా సైన్స్‌కు 6,344 ర్యాంకు వరకు సీట్లు కేటాయించింది. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించింది.
2. ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల(PVPSIT) ఇది కూడా AICTE, NBA గుర్తింపు పొందిన కళాశాల. విజయనగరంలోనే ఉన్న ఈ కళాశాలలోనూ సీఈసీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. గతేడాది సీఈసీలో 8,347, మెషిన్ లెర్నింగ్‌లో 10,202, డేటా సైన్స్‌లో 11,104, ఐటీలో15,625 ఎంసెట్ ర్యాంకుల వరకు సీట్ల కేటాయింపు జరిగింది.
3. ఆంధ్రా లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ(ALIET)...ఇది కూడా AICTE గుర్తింపు ఉన్న కళాశాలే. ఇక్కడా సీఈసీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గతేడాది సీఈసీకి 28,290, మెషిన్ లెర్నింగ్ 38,128ఐటీ 47,654 డేటా సైన్స్ 50,151 ర్యాంకుల వరకు సీట్లు దక్కాయి.
4. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(RKCE) విజయవాడలోనే ఉన్న ఈ కాలేజీ కూడా AICTE గుర్తింపు పొందింది. ఈసీఈ,సీఈసీ, ఈఈఈ, మెకానిక్, సివిల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు S.R.K ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లింగాయస్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ కళాశాల, పొట్టి శ్రీరాములు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల, DJR ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మహిళలకోసం ప్రత్యేకంగా విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉన్నాయి. వీటితోపాటు సమీపంలోనే ఇబ్రహీంపట్నం, నున్న, పెనమలూరు, గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
అప్పటికీ, ఇప్పటికీ వన్నె తరగని ఇంజినీరింగ్ కోర్సు అంటే సీఈసీ...ఎంసెంట్‌లో మంచి ర్యాంకు పొందిన విద్యార్థి మొదటి ఆప్షన్ ఇదే. కానీ ఇప్పుడు చాలామంది విద్యార్థులు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వైపు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు సైతం ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. కేవలం ఇంజినీరింగ్ కోర్సులే గాక...ఇతర వృత్తివిద్యా కోర్సులను సైతం ఆయా కళాశాలలు అందుబాటులో ఉంచాయి. అయితే విద్యార్థి అభిరుచి, సామర్థ్యం, రవాణా సౌకర్యం, హాస్టల్ ఫెసిలిటీ, ఇవన్నీ బేరీజు వేసుకుని కళాశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా కళాశాలల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, టీచింగ్,నాన్‌టీచింగ్ స్టాప్, లైబ్రరీ, ల్యాబ్ ఇవన్నీ నేరుగా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.