7 Investment Rules To Create Wealth: పెట్టుబడి పెట్టడం వేరు, దానిని సంపదగా మార్చడం వేరు. కాస్త స్థోమత ఉన్న ఎవరైనా పెట్టుబడి పెట్టగలరు. కానీ, కొందరు మాత్రమే దానిని సంపదగా మారుస్తారు. సాధారణ పెట్టుబడిని సంపదలా తీర్చిదిద్దే గేమ్‌ ఆడాలంటే కొన్ని రూల్స్‌ పాటించాలి. భావోద్వేగాలను (emotions) కూడా వదిలేయాలి. అప్పుడే, సంక్లిష్టమైన ఆర్థిక సముద్రాన్ని ఈజీగా ఈదొచ్చు, దీర్ఘకాలిక ఆర్థిక విజయాల సాధనలో విజేతగా నిలవొచ్చు. ఈ సూత్రాలు ఎక్కువ మందికి కలిసొచ్చాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


మీరు సంపద కూడబెట్టేందుకు సాయం చేసే 7 ఆర్థిక నియమాలు:


1) రూల్‌ 72 (Rule of 72)
మీ పెట్టుబడి విలువ రెట్టింపు (double) అయ్యే సమయాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఆర్థిక సూత్రం ఇది. మీ డబ్బు డబుల్‌ అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి వార్షిక రాబడి రేటుతో 72ను భాగించాలి. ఉదాహరణకు, 8 వడ్డీ వచ్చేలా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేస్తే, మీ డబ్బు 9 ఏళ్లలో (72 ÷ 8 = 9) రెట్టింపు అవుతుంది. మీ డబ్బు ఇంకాస్త త్వరగా రెండు రెట్లు కావాలంటే, ఇంకా ఎక్కువ వడ్డీ రేటు వచ్చే మార్గంలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి మొత్తం, రాబడి, పెట్టుబడి కాలం వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇన్వెస్టర్లకు ఈ సూత్రం చాలా విలువైనది. 


2) రూల్‌ 114 (Rule of 114)
ఇది కూడా రూల్‌ 72 లాంటిదే. మీ డబ్బు మూడు రెట్లు (triple) పెరగడానికి ఎంత సమయం పడుతుందో ఈ సూత్రం చెబుతుంది. రూల్ 72 తరహాలోనే, రిటర్న్ రేటుతో 114ని భాగించాలి. ఉదాహరణకు, 8% రాబడితో మీ డబ్బు సుమారు 14.25 సంవత్సరాల్లో (14 సంవత్సరాల 3 నెలలు) ట్రిపుల్‌ అవుతుంది. ఈ టైమ్‌ కాస్త ఎక్కువగా అనిపించొచ్చుగానీ, పెట్టుబడుల విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఇది సాయం చేస్తుంది.


3) రూల్ 144 (Rule of 144)
ఇంకా పెద్ద కలలు కనేవారికి ఈ రూల్‌ పనికొస్తుంది. మీ డబ్బు ఎంతకాలంలో నాలుగు రెట్లు ‍‌(quadruple) పెరుగుతుందో ఈ ఈక్వేషన్‌ తేల్చేస్తుంది. ఇక్కడ కూడా, 144ని రాబడి రేటుతో భాగిస్తే సరిపోతుంది. 


4) రూల్ 70 (Rule of 70)
సంపదను సృష్టించడమే కాదు, అదే సమయంలో, మీ డబ్బుపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా చాలా కీలకం. మీరు పోగేసిన సంపద విలువ ద్రవ్యోల్బణం కారణంగా ఎప్పటికప్పుడు క్షీణిస్తుంది. మీ డబ్బు విలువ సగానికి తగ్గడానికి ఎంత కాలం పడుతుందో రూల్‌ 70 చెబుతుంది. ఇక్కడ, ద్రవ్యోల్బణం రేటుతో 70ని భాగించాలి. ఉదాహరణకు, యావరేజ్‌ ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌ 5% అనుకుంటే, మీ సంపద విలువ 14 సంవత్సరాల్లో సగానికి సగం క్షీణిస్తుంది. కాబట్టి, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం రేటును కూడా పరిగణనలోకి తీసుకోవాలి, దీనిని మించి రాబడి ఇచ్చే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి.


5) 10, 5, 3 రూల్ (10, 5, 3 Rule)
షేర్ల నుంచి 10% తగ్గకుండా, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ నుంచి 5% తగ్గకుండా, బ్యాంక్‌ పొదుపు ఖాతాల నుంచి 3% తగ్గకుండా రాబడి అందుకోవాలని ఈ సూత్రం సూచిస్తుంది. సంపద పెంచుకోవాలంటే ఇలాంటి రాబడులు వచ్చే సాధనాల్లోనే పెట్టుబడి పెట్టాలని ఈ రూల్‌ సూచిస్తుంది.


6) 100 మైనస్ వయస్సు నియమం (100 minus age rule)
మీరు షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటే, ఈ సూత్రం ఆధారంగా ఈక్విటీలకు, డెట్‌కు కేటాయించాలి. ఉదాహరణకు, మీకు 20 ఏళ్లు అయితే, మీ పెట్టుబడిలో 80% మొత్తాన్ని ఈక్విటీలకు & మిగిలిన 20% మొత్తాన్ని డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలోకి పంప్‌ చేయాలి. మీ వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీ పెట్టుబడులు తగ్గుతుంటాయి, డెట్‌లోకి పెరుగుతుంటాయి. దీనివల్ల, మీ వయస్సును బట్టి రిస్క్ & రిటర్న్‌ మధ్య సమతుల్యం సాధ్యమవుతుంది.


7) నికర విలువ నియమం (Net worth rule)
మీరు సంపన్నుడో, కాదో ఎలా గుర్తించాలో తెలుసా?. నికర విలువ నియమం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. మీ వయస్సును మీ స్థూల ఆదాయంతో గుణించాలి, ఆ తర్వాత 20తో భాగించాలి. ఉదాహరణకు, మీ వయస్సు 25 ఏళ్లు, మీ వార్షిక ఆదాయం రూ.12 లక్షలు అనుకుందాం. ఈ కేస్‌లో, మీరు సంపన్నుడిగా లెక్కలోకి రావాలంటే, మీ నికర విలువ రూ.15 లక్షలకు తగ్గకుండా ఉండాలి. మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి, సంపన్నుడిగా మారడానికి ఈ సూత్రం సాయం చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: పేకమేడలా కుప్పకూలిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి