Lower Middle Class Income In Hyderabad 2024: తరం మారేకొద్దీ ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. హోమ్ క్రెడిట్ ఇండియా (HCIN) సంస్థ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఆ స్టడీ ప్రకారం, మన దేశంలో దిగువ మధ్య తరగతి వ్యక్తి నెలవారీ ఆదాయం దాదాపు రూ.33,000 కాగా, ఖర్చు రూ.19,000.


హైదరాబాద్‌, దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె, లఖ్‌నవూ, జైపుర్, భోపాల్, పట్నా, రాంచీ, చండీగఢ్, దెహ్రాదూన్, లూథియానా, కోచి సహా 17 నగరాల్లో ఈ సర్వే జరిగింది. 18-55 సంవత్సరాల వయస్సులో ఉండి, ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్న సుమారు 2,500 మందిని ఆ కంపెనీ ఇంటర్వ్యూ చేసింది.


2023లో... మెట్రో నగరాల్లో నివశించే లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ మనిషి సగటున రూ.33,000; టైర్‌-1 నగరాల్లో రూ.30,000; టైర్-2 నగరాల్లో రూ.27,000 సంపాదించగా, ఈ ఏడాది ఆ మొత్తం పెరిగింది. 2024లో... మెట్రో నగరాల్లో కామన్‌ మ్యాన్‌ రూ.35,000, టైర్‌-1 &2 నగరాల్లో రూ.32,000 ఆర్జిస్తున్నాడని సర్వేలో తేలింది.


సంపాదనలో హైదరాబాదీలు ఫస్ట్‌


దేశంలోని అన్ని నగరాల కంటే ఎక్కువగా, హైదరాబాద్‌లో లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ వ్యక్తి సగటున నెలకు రూ.44,000 ఆదాయం సంపాదిస్తున్నాడట. 


ఇంటి ఖర్చులు


దేశవ్యాప్తంగా కామన్‌ మ్యాన్‌ ఆదాయాలే కాదు, ఖర్చులు కూడా పెరిగాయి. ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్న సంపాదిస్తున్న కుటుంబాల్లో, మొత్తం ఇంటి ఖర్చుల్లో దాదాపు 80% ప్రధాన వ్యక్తి భరిస్తున్నాడట. మిగిలిన వాళ్ల వాటా దాదాపు 20%. విశేషం ఏంటంటే... కుటుంబాన్ని పోషించే విషయంలో 42% మంది మహిళలు ప్రధాన వ్యక్తులుగా ఉన్నారట.


సగటు దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనిపిస్తున్న పెద్ద ఖర్చులు.. కిరాణా సరుకులు & ఇంటి అద్దె. వ్యక్తి ఆదాయంలో కిరాణా సరుకుల కోసం 26%, ఇంటి అద్దె కోసం 21% ఆవిరైపోతున్నాయి. ప్రయాణాలు (19%), పిల్లల చదువులు (15%), వైద్య ఖర్చులు (7%), కరెంటు బిల్లు (6%), వంట గ్యాస్ (4%), మొబైల్ బిల్లులు (2%) వంటివి ఆ తర్వాత లైన్‌లో ఉన్నాయి.


వినోదం కోసం చేసే ఖర్చుల్లో చెన్నై టాప్‌ ర్యాంక్‌ సాధించింది. సగటు మదరాసీ స్థానిక ప్రయాణాలు, షికార్ల కోసం 59%, హోటల్‌ భోజనాల కోసం 54%, సినిమాల కోసం 55% డబ్బును ఖర్చు చేస్తున్నాడట. ఇదే విషయంలో లఖ్‌నవూ ప్రజలు చాలా పొదుపుగా ఉన్నారు. స్థానిక ప్రయాణాలు, షికార్ల కోసం 17%, హోటల్‌ భోజనాల కోసం 14% కేటాయిస్తున్నారు. 


చెన్నైలో, సగటు దిగువ మధ్య తరగతి కుటుంబం ఉండే ఇంటి అద్దె కూడా చాలా ఎక్కువ, మొత్తం ఆదాయంలో 29% రెంట్‌కే వెళ్తోంది. ఈ విషయంలో కోల్‌కతా, జైపుర్‌ 15% అత్యల్ప ఖర్చుతో ఉన్నాయి. 


అహ్మదాబాద్‌, దెహ్రాదూన్‌ ప్రజలు ఫిట్‌నెస్‌ విషయంలో పిసినారులుగా ఉన్నారు, కేవలం 1% కేటాయించారు.


పిల్లల చదువు విషయానికి వస్తే.. బెంగుళూరు, కోచిలో అత్యధికంగా 23% ఖర్చు చేస్తున్నారు. వైద్య ఖర్చుల విషయంలో దెహ్రాదూన్ 13%తో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులో 10% మొత్తంతో అట్టడుగున నిలిచింది.


పొదుపు


హోమ్ క్రెడిట్ ఇండియా అధ్యయనం ప్రకారం... పొదుపు విషయంలో, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని పురుషులు (62%) మహిళల (50%) కంటే ముందున్నారు. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని జెన్‌ Zలో 68% మంది, మిలీనియల్స్‌లో 62% మంది, జెన్‌ Xలో 53% మందికి పొదుపు అలవాట్లు ఉన్నాయి.  


ప్రాంతాల వారీగా చూస్తే.. భారతదేశ తూర్పు ప్రాంతంలో ప్రజల్లో 63% మంది ఏదోక రూపంలో పొదుపు చేస్తున్నారు. పశ్చిమ భారతంలో 61% మంది, దక్షిణ భారతంలో 59% మంది, ఉత్తరం భారతంలో 59% మంది ప్రజలు సేవింగ్స్‌ చేస్తున్నారు. 


నగరాల వారీగా చూస్తే... మెట్రో నగరాల్లోని దిగువ మధ్యతరగతి ప్రజలు (62%‌) పొదుపులో ముందు వరుసలో ఉన్నారు. టైర్ 1 నగరాల్లో 61% మంది, టైర్ 2 నగరాల్లో 54% మంది పొదుపుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: మీ సంపద పెంచే సెవెన్ వండర్స్‌- ఎక్కువ మందికి అచ్చొచ్చాయట!