Income Tax Return Filing 2024: కొంతమంది వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌-16 (Multiple Form-16s) ఉండొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి ఒక్క ఫామ్‌-16 ఉంటే, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారిన వ్యక్తికి ఎక్కువ Form-16s ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారిన వ్యక్తి.. తన ప్రస్తుత సంస్థ నుంచి ఫామ్‌-16 తీసుకుని, దాని ఆధారంగా ITR ఫైల్‌ చేస్తే సరిపోదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కంపెనీల్లో పని చేస్తే, అన్ని కంపెనీల నుంచి పొందిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్న్‌లో చూపాలి. ఎక్కువ ఉద్యోగాలు మారిన వ్యక్తి ఐటీ రిటర్న్‌ (ITR 2024) దాఖలు చేసేటప్పుడు కొంత గందరగోళం ఉంటుంది.


గందరగోళం లేని మార్గం
ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారితే.. ఆ ఉద్యోగి, మొదట, ఫారం-12Bని కొత్త కంపెనీలో సమర్పించాలి. ఈ ఫారాన్ని పాత సంస్థ నుంచి తీసుకోవాలి. పాత కంపెనీ ఇచ్చిన జీతభత్యాలు, సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80D కిందకు వచ్చే మినహాయింపులు, TDS వంటివి Form-12Bలో ఉంటాయి. ఇప్పుడు, కొత్త కంపెనీ, ఫామ్‌-16 జారీ చేసే సమయంలో ఫామ్‌-12Bని ఉపయోగించుకుంటుంది, కంబైన్డ్‌ ఫామ్‌-16ను ఆ ఉద్యోగికి ఇస్తుంది. దాని ఆధారంగా ఐటీ రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. ఇలాంటి కేస్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు.


పాత కంపెనీ ఫామ్‌-12B ఇవ్వకపోతే?
పాత కంపెనీ మీకు ఫారం-12B ఇవ్వకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. పాత కంపెనీ నుంచి ఫామ్‌-16 తీసుకోండి. కొత్త కంపెనీ కూడా ఫామ్‌-16 జారీ చేస్తుంది. ఇప్పుడు, టాక్స్‌పేయర్‌ దగ్గర రెండు ఫామ్‌-16s ఉంటాయి. ఐటీ రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఈ రెండు ఫారాల్లోని గ్రాస్‌ శాలరీని కలపాలి. దీనివల్ల మొత్తం జీతపు ఆదాయం తెలుస్తుంది. ఆ తర్వాత, రెండు ఫామ్-16లో ఉన్న హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌ (LTA) వంటివి కూడా కూడాలి. తద్వారా మినహాయింపుల మొత్తం వస్తుంది. గ్రాస్‌ శాలరీ నుంచి అలవెన్స్‌లు తీసేసిన తర్వాత, 'ఇన్‌కమ్ ఛార్జబుల్‌ అందర్ శాలరీ హెడ్' ‍‌(Income chargeable under salary head) వస్తుంది. జీతం కాకుండా... సేవింగ్స్ ఖాతా, FD వంటి వాటి మీద వడ్డీ లేదా ఇతర ఆదాయాలు ఉంటే వాటిని 'ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్స్‌'లో (Income from other source) చూపించాలి. ఇప్పుడు టోటల్‌ గ్రాస్‌ ఇన్‌కమ్‌ వస్తుంది. ఆ తర్వాత, 80C, 80D వంటి డిడక్షన్స్‌ క్లెయిమ్ చేయాలి. ఈ ప్రాసెస్‌ పూర్తి చేసిన తర్వాత 'నెట్‌ టాక్సబుల్‌ ఇన్‌కమ్‌' (Net Taxable Income) వస్తుంది. ఒకవేళ, పాత & కొత్త కంపెనీలు ఫారం-16లో ఒకే తగ్గింపులు చూపే అవకాశం ఉంది. మీరు మాత్రం ఒక్క డిడక్షన్‌ తీసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.


నెట్‌ టాక్సబుల్‌ ఇన్‌కమ్‌ వచ్చిన తర్వాత, టాక్స్‌ లయబిలిటీని ‍‌(Tax liability) గణించాలి. రెండు ఫారం-16లోనూ TDS కట్‌ అయితే, ఐటీ రిటర్న్‌లో అన్నీ క్లెయిమ్‌ చేయాలి. ఫైనల్‌గా, చెల్లించాల్సిన పన్ను ఎంతో లెక్క తేలుతుంది. 


పాత కంపెనీ ఫామ్‌-16 కూడా ఇవ్వకపోతే?
ఒకవేళ, పాత కంపెనీ ఫామ్‌-16 కూడా ఇవ్వకుంటే... ఆ సంస్థ 'పే స్లిప్/ శాలరీ స్లిప్‌' అవసరం అవుతుంది. శాలరీ స్లిప్‌లోని వివరాలను బట్టి మీ ఏడాది జీతభత్యాలు, మినహాయింపులు లెక్కించొచ్చు. పాత కంపెనీ కట్‌ చేసిన TDS డిటైల్స్ ఫామ్‌-26ASలో ఉంటాయి. సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80D కింద తగ్గింపులను క్లెయిమ్ చేసిన తర్వాత నెట్‌ టాక్సబుల్‌ ఇన్‌కమ్‌ తెలుస్తుంది. దీనిని బట్టి మీరు ఏ టాక్స్‌ శ్లాబ్‌లోకి వస్తోరో అర్ధమవుతుంది.


మరో ఆసక్తికర కథనం: పేకమేడలా కుప్పకూలిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి