TCS Job Scam: ఉద్యోగం ఇవ్వడానికి లంచం తీసుకున్నారన్న వార్తలు మనకు కొత్తేమీ కాదు. కానీ, దేశంలో మేజర్‌ ఐటీ కంపెనీ TCS పేరు జాబ్‌ స్కామ్‌లో బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. విలువలకు పెద్ద పీట వేసే టాటా గ్రూప్‌లో జరిగిన ఇలాంటి సంఘటన ఇటు షేర్‌హోల్డర్లకు, అటు జనానికి షాక్‌ ఇచ్చింది. బహుశా, టీసీఎస్‌లో ఇలాంటి స్కామ్ ఇదే మొదటిది కావచ్చు.


వెలుగులోకి తీసుకొచ్చిన విజిల్‌ బ్లోయర్
టీసీఎస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు, అక్కడ పని చేసే కొందరు పైస్థాయి అధికారులు లంచాలు మెక్కారు. అయితే, జాబ్‌ ఆశించిన వ్యక్తుల నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా, స్టాఫింగ్ కన్సల్టెన్సీ కంపెనీల (ఉద్యోగాలు ఇప్పించే మధ్యవర్తి సంస్థలు) నుంచి భారీ మొత్తాల్లో ముడుపులు అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ ఒక విజిల్‌ బ్లోయర్‌ (అక్రమాల గురించి హెచ్చరించే అజ్ఞాత వ్యక్తి) ద్వారా వెలుగులోకి వచ్చింది. అతను, ఈ విషయం గురించి TCS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు (COO) మెయిల్‌ చేశాడు. TCSలో రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG) గ్లోబల్ హెడ్‌గా పని చేస్తున్న ES చక్రవర్తి, కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినందుకు బదులుగా స్టాఫింగ్ కంపెనీల నుంచి కొన్నేళ్లుగా కమీషన్ తీసుకుంటున్నారని విజిల్‌ బ్లోయర్ ఆరోపించాడు.


తీగ లాగిన టీసీఎస్‌ - కొందరిపై వేటు
కంపెనీ CEOగా కె.కృతివాసన్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ఈ స్కాండల్‌ బయటకు రావడం విశేషం. విజిల్‌ బ్లోయర్‌ ఈలతో అలెర్ట్‌ అయిన TCS, ఈ విషయంలో తీగ లాగేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్ కూడా ఉన్నారు. కొన్ని వారాల విచారణ తర్వాత, TCS, చక్రవర్తిని సెలవుపై పంపింది. చక్రవర్తి 1997 నుంచి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 


రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లోని నలుగురు ఎగ్జిక్యూటివ్‌లను సస్పెండ్ చేసింది. రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ అరుణ్‌ జీకేపై కూడా వేటు వేసింది. అంతేకాదు, మూడు స్టాఫింగ్‌ కంపెనీలను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. చక్రవర్తి, అరుణ్‌ కాకుండా, ఐటీ కంపెనీ చర్యలు తీసుకున్న అధికార్ల పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మూడు స్టాఫింగ్‌ సంస్థల పేర్లను కూడా టీసీఎస్ వెల్లడించలేదు.


రూ. 100 కోట్ల కమీషన్
వార్తల ప్రకారం, టీసీఎస్‌లో ఉదారంగా ఉద్యోగాలు ఇచ్చి కమీషన్లు తీసుకున్న వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు, అయితే, ఈ ఎపిసోడ్‌లో కనీసం రూ. 100 కోట్లు కమీషన్ తీసుకున్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి, RMG డివిజన్‌లో 3,000 మంది ఉన్నారు. ప్రతిరోజూ 1,400 మంది ఇంజినీర్లను వివిధ ప్రాజెక్టులకు ఎలాట్‌ చేస్తుంది. అంటే TCS RMG విభాగం ప్రతి నిమిషానికి కొత్త ప్లేస్‌మెంట్ ఇస్తోంది. దీనిని బట్టి కమీషన్ల వ్యవహారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.


టాటా గ్రూప్ IT కంపెనీ, ఇండియన్‌ కార్పొరేట్ కంపెనీల్లోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చింది. 2022 చివరి నాటికి TCS ఉద్యోగుల సంఖ్య 6.15 లక్షలు. గత 3 సంవత్సరాలలో కంపెనీ సుమారు 3 లక్షల రిక్రూట్‌మెంట్‌లను చేసింది. వీరిలో 50 వేల మందిని ఇటీవలి నెలల్లోనే తీసుకుంది. TCS ఒక్కటే కాదు, అన్ని పెద్ద IT కంపెనీల రిక్రూట్‌మెంట్స్‌లో స్టాఫింగ్ సంస్థలు చక్రం తిప్పుతాయి.


మరో ఆసక్తికర కథనం: అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై అమెరికా ఆరా, టపటాపా పడిపోయిన స్టాక్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial