Indian IT Companies: అమెరికన్ ఐటీ మేజర్ యాక్సెంచర్ (Accenture Plc) ప్రకటించిన Q3 ఫలితాలు ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీకి రెడ్‌ సిగ్నల్స్‌ పంపాయి. దీంతో, ఇవాళ (శుక్రవారం, 23 జూన్‌ 2023) నిఫ్టీ IT ఇండెక్స్‌ 1% పైగా నష్టపోయింది.


సెప్టెంబరు-ఆగస్ట్‌ కాలాన్ని ఒక ఆర్థిక సంవత్సరంగా యాక్సెంచర్‌ పాటిస్తుంది. కాబట్టి, 2023 మార్చి - మే కాలం ఈ కంపెనీకి మూడో త్రైమాసికం‍‌ (Q3). 


Q3లో, యాక్సెంచర్ 5% (YoY) ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇది వాల్‌ స్ట్రీట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నా, మొత్తం FY23 ఆదాయ వృద్ధి గైడెన్స్‌తోనే ఇండియన్‌ కంపెనీలకు ఇబ్బంది వచ్చింది. ఈ US కంపెనీ, FY23 రెవెన్యూ గైడెన్స్‌ను 100 bps తగ్గించి, 8-9%కు (YoY) పరిమితం చేసింది. ఇది, భారతీయ పెట్టుబడిదార్లలో బీపీ పెంచింది.


యాక్సెంచర్‌ రిజల్ట్స్‌కు, ఇండియన్‌ ఐటీ సెక్టార్‌కు సంబంధం ఏంటి?
యాక్సెంచర్‌, ఒక గ్లోబల్‌ ఐటీ మేజర్‌. ఇది ఐరిష్‌-అమెరికన్‌ కంపెనీ. డబ్లిన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. ఐటీ రంగానికి సంబంధించి, యాక్సెంచర్‌ను ఒక టార్చ్‌ బేరర్‌గా చూడవచ్చు. గ్లోబల్‌ ఐటీ ఫర్మ్స్‌లో, త్రైమాసిక ఫలితాలను ముందుగా ఈ కంపెనీ ప్రకటిస్తుంది. మన ఐటీ ఇండస్ట్రీ ప్రధాన మార్కెట్‌ అమెరికా కాబట్టి, యాక్సెంచర్‌ రిజల్ట్స్‌ ఆధారంగా మన దేశంలో ఐటీ కంపెనీల భవిష్యత్తును దలాల్‌ స్ట్రీట్‌ అంచనా వేస్తుంది. యాక్సెంచర్‌ ఫలితాలు బాగుంటే, ఇండియన్‌ ఐటీ సెక్టార్‌ బాగున్నట్లు. యాక్సెంచర్‌ ఫలితాల్లో ప్రతికూలత కనిపిస్తే, మన ఐటీ కంపెనీల ఆదాయాలపైనా నెగెటివ్‌ ఎఫెక్ట్‌ ఉన్నట్లు భావిస్తారు. కాబట్టి, ఇండియన్‌ ఐటీ సెక్టార్‌కు సంబంధించి యాక్సెంచర్‌ నంబర్లను కీలకంగా చూస్తారు, కామెంటరీని ప్రామాణికంగా తీసుకుంటారు.


ఆర్థిక మాద్యం కారణంగా గ్లోబల్‌ డిమాండ్‌ ఔట్‌లుక్‌ మసకబారింది. టెక్నాలజీపై చేయాల్సిన ఖర్చులో గ్లోబల్‌ క్లయింట్స్‌ కోతలు పెట్టారు. దీనివల్ల, ఇండియన్‌ ఐటీ కంపెనీలకు రావల్సిన ఆర్డర్ల నంబర్‌, డీల్‌ సైజ్‌లు తగ్గాయి. ఇప్పటికే, Q4FY23 ఫలితాల్లో అవి నిరాశపరిచాయి. Q1FY24 (ఏప్రిల్‌-జూన్) ఫలితాలు కూడా ఇన్వెస్టర్లకు రుచించకపోవచ్చని యాక్సెంచర్‌ నంబర్లను బట్టి అర్ధం అవుతోంది. ఈ పరిస్థితిని కొన్ని నెలల ముందే పసిగట్టిన ఫారిన్‌ ఇన్వెస్టర్లు (FIIలు), ఐటీ స్టాక్స్‌లో నెట్‌ సెల్లర్స్‌గా ఉంటున్నారు. FIIల అమ్మకాల ఎఫెక్ట్‌ కొన్ని నెలలుగా ఐటీ ఇండెక్స్‌ మీద స్పష్టంగా కనిపిస్తోంది.


ఇవాళ, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, HCL టెక్ షేర్లు 1% నష్టంతో ట్రేడవుతుండగా, LTIమైండ్‌ట్రీ 2% జారిపోయింది.


ఆదాయాలు తగ్గినా లార్జ్‌ క్యాప్స్‌ ముద్దు
అయితే, డిమాండ్‌ వాతావరణం అనుకూలంగా లేకపోయినా లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు తట్టుకోగలవని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో, దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్.. HCL టెక్, ఇన్ఫోసిస్, TCSని ఇష్టపడుతోంది. ఎమ్‌కే గ్లోబల్‌.. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, HCL టెక్‌, TCSను ఎంపిక చేసుకుంది.


మరో ఆసక్తికర కథనం:'మాల్‌ ఆన్‌ వీల్స్‌' - జర్నీలో షాపింగ్, స్టేషన్‌లో దిగగానే డెలివెరీ 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.